డ్యూటీ విషయంలో గొడవలకు ఓ ప్రాణం బలి

by Dishafeatures2 |
డ్యూటీ విషయంలో గొడవలకు ఓ ప్రాణం బలి
X

దిశ, డైనమిక్ బ్యూరో : కడప నగరంలోని సంచలనం సృష్టించిన పశు వైద్య శాఖలో డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ అపహరణ, హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈకేసులో కడప పశువైద్యశాలలో అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డా. సుభాష్ చంద్ర బోస్ (43 ) ప్రధాన నిందితుడని విచారణలో వెల్లడైంది. సుభాష్ చంద్రబోస్ తన బంధువు బావలూరి చెన్నకృష్ణ (44), మూడే బాలాజీ నాయక్ (26)ల సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. డ్యూటీ విషయంలో మెుదలైన గొడవలు, అపార్థాలే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు.

ఎస్పీ అన్బురాజన్ తెలిపిన వివరాల ప్రకారం డా.అచ్చన్న 2021 నుండి కడపలోని వెటర్నరీ పాలీ క్లినిక్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. డా. సుభాష్ చంద్రబోస్ 2022 నుండి అదే ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. అయితే డ్యూటీ విషయాలలో డాక్టర్ అచ్చన్నకు డాక్టర్ సుభాష్ చంద్ర బోస్ మధ్య కొన్ని తీవ్రమైన అపార్థాలు చోటు చేసుకున్నాయి. దీంతో తరచూ వివాదాలు జరిగేవి. అయితే డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న వైద్యులు, వైద్య సిబ్బంది జీతాలను 3 నెలల పాటు నిలిపివేసి వారిని సీఎఫ్ఎంఎస్ మరియు ఎఫ్ఆర్ఎస్ సిస్టముల నుండి తొలగించి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో వారి మధ్య చోటు చేసుకున్న వివాదం ఏకంగా ప్రాణాలు తీసేంత వరకు వెళ్లిందని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. డాక్టర్ అచ్చన్న ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న A1 డా. సుభాష్ చంద్రబోస్ ఈనెల9న పోరుమామిళ్ళలోని బావమరిది బావలురి చెన్న కృష్ణను కలిశాడు.

అలాగే మెడికల్ స్టోర్ పార్ట్‌నర్ అయిన A3 మూడే బాలాజి నాయక్‌ను కలిశారు. ఓలాడ్జిలో ముగ్గురు కలిసి ఈనెల 12న హత్యకు పథకం రచించారని తెలిపారు. ఈనెల 12న ఉదయం 11.00 గంటలకు సీఎస్ఐ చర్చి సమీపంలోని చర్చికి వెళ్లొస్తున్న డా.అచ్చెన్నను నిందితులు కిడ్నాప్ చేసి రాయచోటికి తీసుకెళ్లి శివార్లలో మద్యం తాగించి, చికెన్ తినిపించారు. అనంతరం గువ్వల చెరువు ఘాట్ రోడ్డుకు తీసుకెళ్లి అచ్చెన్నను డా.సుభాష్ చంద్రబోస్ అతడి ఛాతిపై బలంగా కాలితో తన్నాడు. దీంతో డాక్టర్ అచ్చన్న లోయలో పడిపోగా నిందితులు A1, A2,A3లు డా.అచ్చన్నను అక్కడే వదిలి పరారయ్యారు అని తెలిపారు. అనంతరం నిందితులు సాక్ష్యాధారాలను రూపు మాపేందుకు మృతుడి మొబైల్ ఫోన్‌ను తీసుకుని, మొబైల్ ఫోన్‌ను ఒక చోట, సిమ్‌కార్డును మరో చోట పారవేసినట్లు వెల్లడించారు. డాక్టర్ అచ్చన్న కుమారుడు డాక్టర్ క్లింటన్ చక్రవర్తి కడప వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఈనెల 24న గువ్వల చెరువు ఘాట్ వద్ద లోయలో డా.అచ్చన్న మృతదేహాన్ని గుర్తించి రామాపురం పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఈనెల 26న నిందితులు కడప వీఆర్వో ఎదుట లొంగిపోయి తమ నేరాన్ని అంగీకరించారని ఎస్పీ వెల్లడించారు. అనంతరం నిందితులను వీఆర్వో కడప 1 పట్టణ ఇన్‌స్పెక్టర్ ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. అనంతరం నిందితులను జుడీషియల్ రిమాండ్ నిమిత్తం కడప కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

Next Story

Most Viewed