Crime News: ఆ నలుగురి మరణం వెనుక మిస్టరీ..?

by Disha Web Desk |
Crime News: ఆ నలుగురి మరణం వెనుక మిస్టరీ..?
X

దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడిన ఘటన కొత్త మలుపు తిరగనుందా..? వేముల శ్రీకాంత్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన ఆ అంశం చుట్టే పరిశోధన సాగనుందా..? ఫోరెన్సిక్ లాబోరేటరీ రిపోర్ట్ వచ్చిన తరువాత ఏం జరగనుంది..?

ఒకే రకమైన మరణాలు...

గంగాధర మండల కేంద్రానికి చెందిన వేముల శ్రీకాంత్ కొడుకు అద్వైత్ (20 నెలలు) నవంబర్ 16న, కూతురు అమూల్య(6) డిసెంబర్ 4న, భార్య మమత (29) డిసెంబర్ 16న చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. రక్తంతో కూడిన వాంతులు, విరోచనాలు రావడంతో వీరిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మరణించారు. వింత వ్యాధి బారిన పడ్డ ఈ కుటుంబాన్ని విధి వెంటాడుతోందన్న ఆవేదన స్థానికంగా వ్యక్తం అయింది. అభం శుభం తెలియని చిన్నారులను సైతం అంతు చిక్కని రోగం కబలించడం స్థానికులను కలిచివేసింది. ముక్కుపచ్చలారని బిడ్డలను మృత్యువు అర్థంకాని రోగంతో బలి తీసుకుందని తెలిసి ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేశారు. అయితే శనివారం తెల్లవారు జామున కరీంనగర్ చల్మెడ ఆసుపత్రిలో శ్రీకాంత్ (33) కూడా చనిపోవడంతో ఆయన కూడా వింత వ్యాధి బారిన పడి చనిపోయాడని మొదట భావించారు. కానీ అర్థరాత్రి గంగాధర ఎస్సై రాజు చల్మెడ ఆసుపత్రికి చేరుకుని శ్రీకాంత్ నుంచి సేకరించిన వివరాలు తెలిసిన తరువాత ఈ అంశం కొత్త మలుపు తిరగబోతోందా అన్న చర్చ మొదలైంది.

మొదట ఏవో టాబ్లెట్స్ వేసుకున్నాడని గమనించిన అతని కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సమీప బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన రాజు మింగిన మాత్రలు విషపూరితమైనవేమోనన్న అనుమానంతో అతనితో వాంతులు చేయించారు. ఈ క్రమంలో ఆయన కూడా రక్తం వాంతి చేసుకోవడంతో ఆందోళన చెందిన వారి కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే శ్రీకాంత్ ఏ మాత్రలు వేసుకున్నాడో చెప్పేందుకు నిరాకరించడంతో వైద్యులు సరైన చికిత్స అందించలేకపోయారు. గంగాధర ఎస్సై రాజు శ్రీకాంత్ ను ప్రశ్నించడంతో సోడియం హైడ్రాక్సైడ్ మాత్రలు వేసుకున్నానని చెప్పడంతో అప్పుడు ట్రీట్ మెంట్ ప్రారంభించినప్పటికీ అతడిని కాపాడలేకపోయారు. అయితే శ్రీకాంత్ భార్య, పిల్లలు అందరూ కూడా రక్తంతో కూడిన వాంతులు చేసుకున్నట్టుగా ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. శ్రీకాంత్ కూడా అదే రీతిలో రక్తంతో కూడిన వాంతులు చేసుకోవడంతో అతని భార్యా పిల్లలు కూడా సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఉంటారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

ఇటీవల వరకు శ్రీకాంత్ ఓ ప్రైవేటు కాలేజీలో సైన్స్ ల్యాబ్ లో ఫ్మాకల్టీగా పనిచేయడంతో పరీక్షలకు ఉపయోగించే వివిధ రకాల రసాయనాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ సైన్స్ ల్యాబ్ లో ఉపయోగించే వీటిని ఇంటికి తీసుకెళ్లి ఉంటాడేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రమాదకరమైన వీటిని కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంచే అవకాశం కూడా ఉండదన్న వాదనలు కూడా వినిపిస్తున్నప్పటికీ నలుగురు కూడా ఒకే రకంగా రక్తంతో కూడిన వాంతులు చేసుకుని మరణించడం, శ్రీకాంత్ చనిపోయే ముందు తాను ఏం మాత్రలు వేసుకున్నానో వివరించడంతో ఈ అనుమానానికి తావిస్తోంది. అయితే శ్రీకాంత్ చాలా సౌమ్యంగా ఉంటాడని, ఇంతకు ముందు పనిచేసిన కాలేజీలో కానీ, గంగాధరలో కానీ ఆయన మంచి వ్యక్తనే చెప్తున్నారు. దీంతో ఆయన సైన్స్ ల్యాబ్ లో ఉపయోగించే కెమికల్స్‌ను ఇంటికి తీసుకెళ్లే అవకాశం అయితే లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అదే నిజమైతే..?

శ్రీకాంత్ భార్య పిల్లలకు సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చాడన్న అనుమానమే నిజమైతే వారిపై ఈ ప్రయోగం ఎందుకు చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదకరమని తెలిసి తన భార్య పిల్లలకు ఎందుకు ఇస్తాడన్న ప్రశ్న కూడా తల్తెత్తుతోంది. సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చి మరీ వారి ప్రాణాలు తీసే అంత సాహసం ఎలా చేస్తాడన్నది మిస్టరీగా మారింది. మరోవైపు ఈ రక్తం కక్కుకుంటూ నవంబర్‌లో కొడుకు అద్వైత్ చనిపోతే, డిసెంబర్ 4న కూతురు అమూల్య మరణించగా 16న భార్య మమత మృతి చెందడం గమనార్హం. వీరికి అదే సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చినట్టయితే ఏక కాలంలోనే వారంతా అనారోగ్యానికి గురి కావాలి కానీ పదిహేను రోజులకొకరు చొప్పున ఆసుపత్రి పాలు అయ్యారంటే ఆ ప్రయోగం వారిపై చేసి ఉండకపోవచ్చని అంటున్న వారూ లేకపోలేదు.

మంత్రాల అనుమానం...

వేముల శ్రీకాంత్ ఇంట్లో మరణ మృదంగం పాడుతున్న తీరుపై ఇంతకుముందు అతడితో చర్చించినప్పుడు ఎవరైనా మంత్రాలు చేసి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తాంత్రిక విద్యల కారణంగానే తన భార్య, పిల్లలు అంతుచిక్కని వ్యాధి సోకి చనిపోయారని కూడా చెప్పాడని అంటున్నారు స్థానికులు. ఆధునిక కాలంలో ఇలాంటి మూఢనమ్మకాలేంటని కొంతమంది ఆయన మాటలను కొట్టిపారేయడంతో బయటకు చెప్పలేకపోయాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ రిపోర్ట్ వస్తేనే...

అయితే శ్రీకాంత్ ఆత్మహత్య తరువాత వచ్చిన అనుమానాలన్ని నివృత్తి కావాలంటే ఇప్పటికే పోలీసులు ఫోరెన్సిక్ సైంటిఫిక్ లాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించిన శరీర భాగాల పరీక్షల రిపోర్టు రావాల్సి ఉందని తెలుస్తోంది. మమత మరణించిన తరువాత అనుమానించిన ఆమె తల్లి గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్టరీ మర్డర్ గా కేసు నమోదు చేసుకున్నా పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మమత మృతదేహం నుంచి కొన్ని భాగాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. దీనికి సంబంధించిన రిపోర్టు వస్తే శ్రీకాంత్ కు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టును సరిచూసుకున్న తరువాత ఓ నిర్ధారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎఫ్ఎస్ఎల్ నుంచి పూర్తి రిపోర్ట్ వచ్చిన తరువాత నిర్ధారించ గలుగుతామని గంగాధర ఎస్సై రాజు తెలిపారు. శ్రీకాంత్ తండ్రి లక్ష్మీపతి మాత్రం తన కోడలు, మనవడు, మనవరాలు మరణించిన తరువాత అత్తింటి వారు కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Next Story

Most Viewed