ఆదరించని కన్నకొడుకులు.. చివరికి ఆ వృద్ధురాలు ఒంటికి నిప్పంటించుకొని..

by Disha Web Desk 11 |
ఆదరించని కన్నకొడుకులు.. చివరికి ఆ వృద్ధురాలు ఒంటికి నిప్పంటించుకొని..
X

దిశ, వీపనగండ్ల: సృష్టిలో తల్లిని మించిన దైవం లేదంటారు.. మరి ఈ రోజుల్లో నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్ధాక్షిణంగా వదిలేస్తున్నారు. కొడుకులు వారికి బుక్కెడు బువ్వ పెట్టలేక నిత్యం వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. ముసలితనంలో కన్నకొడుకుల ఆదరణ కరువై.. బుక్కెడు బువ్వ పెట్టకుండా పెద్ద కొడుకు వేధింపులకు గురిచేస్తుండడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధురాలు ఒంటికి నిప్పుంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వీపనగండ్ల మండలంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీపనగండ్ల గ్రామానికి చెందిన కోమటి సరోజమ్మ కు నలుగురు కుమారులు. బతుకుదెరువు కోసం ఇద్దరు కుమారులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు గ్రామంలోనే వ్యాపారం చేసుకుంటున్నాడు. రెండవ కుమారుడికి కంటిచూపు లేకపోవడంతో గ్రామంలోనే అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. సరోజమ్మ భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. వృద్ధాప్యంలో ఉన్న సరోజమ్మను కొడుకులు సరిగా చూసుకోకుండా హైదరాబాద్ సమీపంలోని వృద్ధాశ్రమంలో ఉంచారు. అక్కడ ఉండలేని సరోజమ్మ మళ్లీ గ్రామానికి వచ్చి ఇంట్లోనే ఉండేది. కాగా పెద్ద కుమారుడు సరిగా చూసుకోకుండా నిత్యం సరోజమ్మను వేధిస్తుండడంతో మనస్థాపం చెంది కొన్ని రోజుల క్రితం ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకునే క్రమంలో గమనించిన స్థానికులు అడ్డుకున్నారు.

ఆ తరువాత కూడా పెద్ద కుమారుడి వేధింపుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలోనే మళ్లీ తీవ్ర మనస్థాపానికి గురైన సరోజమ్మ గురువారం మధ్యాహ్నం ఇంటి వరండాలో ఒంటిపై ఉన్న బట్టలకు నిప్పంటించుకుంది. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పేశారు. వృద్ధురాలు సరోజమ్మకు తీవ్ర గాయాలైనాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయాలైన సరోజమ్మను వైద్యం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైనా వైద్యం కోసం 108 అంబులెన్స్ లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వృద్ధురాలి సరోజమ్మ తుదిశ్వాస విడిచింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామన్ గౌడ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి : సీఎం ప్రోగ్రామ్‌లో మహిళా ఎంపీపీ సర్పంచ్‌లకు చుక్కెదురు.. ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన



Next Story