నేను పక్కా లోకల్... గరీబోళ్ల బిడ్డను

by Disha Web Desk 15 |
నేను పక్కా లోకల్... గరీబోళ్ల బిడ్డను
X

దిశ, కరీంనగర్ రూరల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోబెల్స్ వారసుడని, పచ్చి అబద్దాలు నిజమంటూ పదేపదే నమ్మించేందుకు కుట్రలు చేస్తుండని, రిజర్వేషన్ల రద్దు చేయబోతోందంటూ బీజేపీ పై విష ప్రచారం చేస్తుండని కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్అన్నారు. లౌకిక పదాన్ని తొలగిస్తామన్నందుకు రాజ్యాంగాన్నే మార్చబోతున్న బీజేపీ నేతలను ఏ చెప్పుతో కొట్టాలని అంటున్నాడని, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వంద సార్లకుపైగా రాజ్యంగాన్ని మార్చారని ఆ కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలి అని ప్రశ్నించారు. ఫోన్​ ట్యాపింగ్ సొమ్ముతో కరీంనగర్ లో కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో కార్పొరేటర్ కు 20 లక్షల రూపాయలిస్తే..అందులో రూ.5 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు చర్చ జరుగుతోందన్నారు. తక్షణమే బ్యాంకు లావాదేవీలపై విచారణ చేపట్టడంతోపాటు డబ్బు తీసుకున్న, ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీపీ వాసాల రమేశ్ అధ్యక్షతన జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తాను పక్కా లోకల్... మీరు తయారు చేసిన కార్యకర్తను...మీకు కష్టమొస్తే అండగా నేనున్నానన్నారు. మీ కోసం పోరాటాలు చేసి కరీంనగర్ అభివృద్ధి కోసం రూ.12 వేల కోట్లు తీసుకొచ్చానన్నారు. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మీకోసం ఎన్నడైనా పనిచేశారా? వాళ్లు నాన్ లోకల్.. ఎన్నడైనా పోరాటాలు చేశారా? అన్నారు. కాంగ్రెస్ పొరపాటున గెలిస్తే రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీని ఎత్తేస్తారన్నారు. తద్వారా ఎకరాకు రూ.20 వేల భారం రైతులపై పడే ప్రమాదం ఉందని, కొత్తపల్లిలో పేదలు కట్టుకోవడానికి జాగా లేదని రైతుల భూమిని తీసుకుపోయి ఇతర వర్గం వాళ్లకు ఇచ్చిన ప్రభుత్వంపై పోరాడి కోర్టుకు పోయి విజయం సాధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు.

కాంగ్రెస్ పాలనలో ఈ దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మారిస్తే.. పాలనను గాడిలో పెట్టి దేశం అభివృద్ది కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకుడు మోదీ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి కూడా దిక్కులేరన్నారు. కేసీఆర్ ఎప్పటికీ ప్రధాని కాలేరని, మరి వాళ్లకు ఎందుకు ఓటెయాలని ప్రశ్నించారు. మీకోసం కొట్లాడింది బీజేపీ అన్నారు. మీ కోసం కొట్లాడితే 109 కేసులు పెట్టినా భయపడలేదన్నారు. మరి కాంగ్రెస్ కు ఓటేయడం ఎంత వరకు న్యాయం? అందుకే బీజేపీకి ఓటేయాలని కోరారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని రిపోర్టులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి బెంబేలెత్తి పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి గోబెల్స్ వారసుడని, బీజేపీపై విషం కక్కుతున్నాడని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదంటే మాత్రం మాట్లాడరని ఎద్దేవా చేశారు. గట్టిగా నిలదీస్తే... నన్ను గుండు గాడు అంటూ హేళన చేస్తుండని, గాడిద గుడ్డు చూపిస్తుండని అన్నారు. తులం బంగారం ఇస్తానన్నవ్ ఏది? నెలనెలా మహిళలకు రూ.2500 ఇస్తానన్నవ్,

వడ్లకు రూ.500 బోనస్ పేరుతో ఎకరాకు రూ.14 వేల రూపాయలు ఇస్తానన్నవ్, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తానన్నవ్, ఇల్లు లేని వాళ్లకు జాగాతోపాటు రూ. 5లక్షలు ఇస్తానన్నవ్, విద్యార్థులకు రూ.5 లక్షల కార్డు ఇస్తానన్నవ్ ఏవని అన్నారు. గాడిద గుడ్డు పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాలను ప్రజలు గుర్తించాలన్నారు. రిజర్వేషన్ల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నడన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తానని బీజేపీ ఒప్పుకున్నందుకు మిమ్ముల్ని చెప్పుతో కొట్టాలా? మీ జాతీయ ప్రధాన కార్యదర్శిని చెప్పుతో కొట్టాలా? అని మాట్లాడుతున్నాడని, ఆయనకు సవరణకు, పూర్తిగా మార్చేయడానికి తేడా కూడా తెల్వదు అన్నారు. ఎమర్జెన్సీలో ప్రజలు నరకయాతన పడుతున్న సమయంలో ఇందిరాగాంధీ సెక్యులర్ అనే పదాన్ని బలవంతంగా చొప్పించిన మాట వాస్తవం కాదా? అన్నారు.

మరి 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని 100 సార్లకు పైగా సవరించిందన్నారు. మరి వంద సార్లకుపైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు చెప్పులతో ఉరికించి కొట్టాలో రేవంతే సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పొట్టకొట్టిన పార్టీయే కాంగ్రెస్ అన్నారు. ముస్లింలకు బీసీ ఈ ద్వారా రిజర్వేషన్లు ఇస్తున్నాం అన్నారు. మేము రాముని పేరు తెస్తే తప్పుపడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పుస్తకంలోనే రామాయణ సంఘటన చిత్రాలున్న సంగతి మర్చిపోయి వాగుతున్నారని తెలిపారు. దేవుడిని తలిచి కొలిచే కోట్లాది మంది భక్తులను అవమానించినట్లే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు వియ్యంకుడి ద్వారానే బేరసారాలు జరిగాయన్నారు. మీరు ఓటేస్తే ఎంపీగా గెలిచి మోదీని ప్రధాని చేసే అవకాశమివ్వండన్నారు. పేదల బిడ్డ, పిలిస్తే పలికే బీసీ బిడ్డ బండి సంజయ్ కావాలా? ప్రజలకు ఎన్నడూ ముఖమే చూపని కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు కావాలా అన్నారు.

Next Story

Most Viewed