బోయింగ్ మాజీ ఉద్యోగిది ఆత్మహత్యే.. గతంలో విమానాల భద్రతపై ఆరోపణలు

by Harish |
బోయింగ్ మాజీ ఉద్యోగిది ఆత్మహత్యే.. గతంలో విమానాల భద్రతపై ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: విమానాల తయారీ సంస్థ బోయింగ్ భద్రత, ఉత్పత్తి ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేసిన జాన్ బార్నెట్‌ అనే విజిల్‌బ్లోయర్ ఆత్మహత్యతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. 62 ఏళ్ల వయసు కలిగిన ఆయన మార్చి 9న అమెరికాలోని సౌత్ కరోలినాలో తన ట్రక్కులో చనిపోయాడు. ఆయన మరణంపై విచారణ జరిపిన పోలీసులు తాజాగా జాన్ బార్నెట్‌‌ సూసైడ్ చేసుకున్నాడని ప్రకటించారు. జాన్ బార్నెట్ 30 సంవత్సరాలకు పైగా బోయింగ్‌లో పనిచేశారు, భద్రతకు సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌గా 2017లో పదవీ విరమణ చేశాడు. అయితే బోయింగ్ 787 విమానాలలో ఆక్సిజన్ వ్యవస్థలలో భద్రతకు సంబంధించి పలు సమస్యలను గుర్తించి వాటిపై ఆందోళన లేవనెత్తాడు. ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్‌లలో 25 శాతం వైఫల్యం ఉందని అతను ఆరోపించాడు.

దీని గురించి కంపెనీకి వ్యతిరేకంగా కోర్టులో దావా వేశాడు. అతని వాదనను బోయింగ్‌ ఖండించింది. ఆయన మరణించడానికి ముందు కోర్టులో తన వాదనలు వినిపించిన అతను తరువాతి విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో పోలీసులు అతని కోసం వెతుకుతుండగా మార్చి 9న ట్రక్కులోని డ్రైవర్ సీటులో శవమై కనిపించాడు. ఈ సమయంలో అతని తలపై తుపాకీ గాయం ఉండగా, కుడి చేతిలో తుపాకీని కనుగొన్నారు. అతని ప్రక్కనే సూసైడ్ నోట్ కూడా ఉంది. దానిలో అతను తన కుటుంబం, స్నేహితులకు "ఐ లవ్ యూ ఆల్" అని, బోయింగ్‌ను మాత్రం తిడుతూ రాసినట్లుగా ఉంది. అయితే ఈ నోట్‌లో జాన్ బార్నెట్ వేలిముద్రలు మాత్రమే కనిపించినందున అది జాన్ బార్నెట్‌దేనని అధికారులు ధృవీకరించారు. బార్నెట్ సూసైడ్ చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని అతని లాయర్ అన్నారు.

Next Story

Most Viewed