లిక్కర్ స్కామ్‌లో ఐదుగురికి బెయిల్

by Dishafeatures2 |
లిక్కర్ స్కామ్‌లో ఐదుగురికి బెయిల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకున్నది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, సమీర్ మహేంద్రు, అరవ గోపీకృష్ణ, విజయ్ నాయర్, అమన్‌దీఫ్ ధల్, మనోజ్‌రాయ్‌లకు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ముత్తా గౌతమ్‌కు కూడా బెయిల్ మంజూరైంది. సమీర్ మహేంద్రును ఈడీ అరెస్టు చేయడంతో జైల్లో ఉంటున్నారు. సీబీఐ బెయిల్ మంజూరు చేయవద్దంటూ స్పెషల్ కోర్టులో తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. ఫిబ్రవరి 23న అన్ని వైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టు మంగళవారం ఉత్తర్వులను జారీచేసింది.

సమీర్ మహేంద్రుకు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ లోతుగా వాదించింది. అయితే అనారోగ్యం కారణంగా సర్జరీ చేయించుకోవాల్సి ఉన్నదని ఆయన తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో జడ్జి సానుకూలంగా స్పందించారు. సమీర్ మహేంద్రుకు అవసరమైన అన్ని రకాల ఆరోగ్య పరీక్షలను ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేయిస్తున్నట్లు సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆయనకు మెడికల్ ట్రీట్‌మెంట్‌ను అడ్డుకునే ఉద్దేశం లేదని, కానీ అత్యవసరమైన సర్జరీ ఏమీ కాదని కోర్టుకు తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన కొన్ని తీర్పులను ఉటంకించారు.

సమీర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని.. కస్టడీలో ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని పరిరక్షించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. సర్జరీ అవసరం ఉన్నప్పటికీ కేవలం పెయిన్ కిల్లర్ మాత్రలతోనే సరిపెడుతున్నారని, ఈ కారణంగా మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తి చివరకు లివర్ మీద ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. సర్జరీ కోసం బెయిల్ మంజూరు చేసినా దర్యాప్తు సంస్థకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వడానికి అందుబాటులోనే ఉంటారని తెలిపారు. చివరకు స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.


Next Story

Most Viewed