గంటల్లోనే సంచలన కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు

by Disha Web Desk 2 |
గంటల్లోనే సంచలన కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసులో రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే మిస్టరీని ఛేధించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ప్రేమజంటను అదుపులోకి తీసుకుని 14 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనర్​డీఎస్ చౌహాన్​ఎల్బీనగర్​క్యాంప్​కార్యాలయంలో సోమవారం రాత్రి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హయత్​నగర్​ప్రాంతంలోని తొర్రూరులో నివాసముంటున్న సత్తెమ్మ (82) ఒంటరిగా నివాసముంటోంది. ఇటీవల వనస్థలిపురం ప్రశాంత్​నగర్‌లో ఉంటున్న కొడుకు వద్దకు వెళ్లిన సత్తెమ్మ ఆదివారం తన ఇంటికి వచ్చింది. రాత్రి 11గంటలకు ఫోన్ చేసి కొడుకుతో మాట్లాడింది. సోమవారం ఉదయం సత్తెమ్మ ఉంటున్న ఇంటి తలుపులు తెరిచి ఉండటం.. ఆమె బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి ఇరుగుపొరుగు లోపలికి వెళ్లి చూడగా ఆమె హత్యకు గురై కనిపించింది. వెంటనే ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు.

కిరాయిదారే సూత్రధారి...

ఒంటరిగా నివాసముంటున్న సత్తెమ్మ తన ఇంట్లోని ఓ పోర్షన్‌ను కొన్నేళ్ల క్రితం కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్న లలిత (35)కు అద్దెకిచ్చింది. ఇదిలా ఉండగా నారాయణపేట్​జిల్లా దామరగిద్ద నివాసి, ముత్తూట్​ఫైనాన్స్​ఉద్యోగి అయిన రాకేశ్​(28)తో దాదాపు ఏడాదిన్నర క్రితం ఆమెకు పరిచయం ఏర్పడింది. రాకేశ్​సోదరుడు తొర్రూరులో కొత్త ఇల్లు కట్టుకున్నపుడు పనులు పర్యవేక్షించేందుకు రాకేశ్​కొన్నాళ్లపాటు ఇక్కడ ఉన్నాడు. ఆ సమయంలో లలిత ఇంటి నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేసింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆరు నెలలుగా తొర్రూరులోనే ఉంటున్న రాకేశ్​తరచూ లలితను కలవటానికి ఆమె ఇంటికి వచ్చి వెళుతున్న క్రమంలో అతనికి సత్తెమ్మతో కూడా పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే సత్తెమ్మ ఒంటిపై ఉన్న బంగారు నగలపై రాకేశ్​కన్నుపడింది. ఎలాగైనా సరే ఆ నగలను దోచుకోవాలని నెల రోజుల క్రితం రాకేశ్, లలిత కలిసి కుట్ర పన్నారు.

దాని ప్రకారం ఆదివారం రాత్రి సత్తెమ్మ ఇంటి బయట కూర్చుని ఉండగా అక్కడకు రాత్రి 10గంటల సమయంలో వచ్చిన రాకేశ్​లోపలికి వెళ్లి సత్తెమ్మ ఉంటున్న పోర్షన్‌లో దాక్కున్నాడు. గంట తరువాత కొడుకుతో ఫోన్‌లో మాట్లాడిన సత్తెమ్మ తన పోర్షన్​లోకి వెళ్లి తలుపులు వేసుకుని నిద్రపోయింది. ఆ తరువాత తలుపు తెరిచిన రాకేశ్​పక్క పోర్షన్‌లోనే ఉన్న లలితను లోపలికి పిలిపించుకున్కాడు. అనంతరం దిండుతో సత్తెమ్మ ముఖాన్ని అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ సమయంలో లలిత సత్తెమ్మ రెండు కాళ్లను పట్టుకుంది. సత్తెమ్మ చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత రాకేశ్, లలిత కలిసి ఆమె ఒంటిపై ఉన్న 23 తులాల బంగారు నగలు దోచుకుని ఉడాయించారు. గంటల్లోనే కేసులోని మిస్టరీని ఛేధించిన పోలీసులు ఈ ఇద్దరిని అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకున్నారు. లభించిన చిన్న చిన్న క్లూల ఆధారంగా నిందితులను కొన్ని గంటల్లోనే అరెస్టు చేసిన ఇన్స్​పెక్టర్లు నిరంజన్, వెంకటేశ్వర్లును కమిషనర్​డీ.ఎస్.చౌహాన్​అభినందించారు.



Next Story

Most Viewed