NIA మెరుపు దాడులు.. నిషేధిత మదర్సా, జమాత్ మాజీ చీఫ్ ఇళ్లలో సోదాలు

by Kema Shiva Kumar |

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్, శ్రీనగర్ జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహించింది.

NIA మెరుపు దాడులు.. నిషేధిత మదర్సా, జమాత్ మాజీ చీఫ్ ఇళ్లలో సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రహస్యంగా ఉగ్రవాదులతో సంబంధాలు, నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇవాళ జమ్మూకశ్మీర్‌లో ముమ్మరంగా సోదాలు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే సౌత్ కాశ్మీర్‌లోని షోపియాన్, శ్రీనగర్ జిల్లాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని ఈ తనిఖీలు కొనసాగాయి. నిషేధిత మదర్సాలో తనిఖీలు షోపియాన్ జిల్లాలోని ఇమామ్ సాహిబ్ ప్రాంతంలో ఉన్న ‘దారుల్ ఉలూమ్ సిరాజుల్ ఉలూమ్’ (Darul Uloom Sirajul Uloom) విద్యా సంస్థలో ఎన్‌ఐఏ బలగాలు సోదాలు నిర్వహించాయి. వందలాది మంది విద్యార్థులకు మతపరమైన, సాధారణ విద్యను అందించే ఈ సంస్థను.. నిషేధిత జమాత్-ఎ-ఇస్లామీ (JeI) సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న నిఘా వర్గాల నివేదికతో గత నెలలోనే ప్రభుత్వం చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించింది.

దేశ భద్రతకు విఘాతం కలిగించేలా ఇక్కడి ప్రాంగణాన్ని వాడుతున్నారన్న ఆరోపణలతో అధికారులు ఇక్కడ రికార్డులను పరిశీలించారు. జమాత్ మాజీ చీఫ్ ఇళ్లపై నిఘా మరో సమాంతర ఆపరేషన్‌లో భాగంగా.. షోపియాన్ జిల్లాలోని మోలు చిత్రగామ్ పరిధిలో నివసిస్తున్న నిషేధిత జమాత్-ఎ-ఇస్లామీ మాజీ చీఫ్ షాహజాదా ఔరంగజేబ్ నివాసంలో ఎన్‌ఐఏ బృందాలు గాలింపు జరిపాయి. అలాగే శ్రీనగర్‌లోని లాల్ బజార్ ప్రాంతంలో ఉన్న ‘జమియాత్ ఉల్ బనాత్’ అనే బాలికల ఇస్లామిక్ పాఠశాలలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ డివైజ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, గతంలో దారుల్ ఉలూమ్ సిరాజుల్ ఉలూమ్ మదర్సాలో చదివిన కొందరు విద్యార్థులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం, ఈ సంస్థకు అందుతున్న ఆర్థిక నిధుల్లో పారదర్శకత లేకపోవడం వల్లే ఎన్‌ఐఏ ఈ కఠిన చర్యలకు దిగినట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు.

Next Story