మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు.. భార్య , కూతుళ్లకు కూడా

by Dishafeatures2 |
మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు.. భార్య , కూతుళ్లకు కూడా
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత నారాయణకు సీఐడీ ఝలక్ ఇచ్చింది. రాజధాని భూముల కేసులో నారాయణకు ఏపీ సీఐడీ మంగళవారం నోటీసులు ఇచ్చింది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చింది. నారాయణతోపాటు భార్య రమాదేవికిసైతం నోటీసులు ఇచ్చింది. మార్చి 6న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. మాజీమంత్రి నారాయణ ఆయన సతీమణితో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్‌ ఎండీ అంజనీకుమార్‌, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్‌, వరుణ్‌లకు సైతం సీఐడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అయితే నారాయణ కుమార్తెలు సింధూర, శరణిలను మార్చి 7న విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.

రాజధాని అమరావతిలో సుమారు 169.27 ఎకరాల అసైన్డ్‌ భూములను నారాయణ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నారాయణ సిబ్బంది, పనిమనుషుల పేర్లతో ఈ భూములు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో సీఐడీ అధికారులు కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలోని నారాయణ కుమార్తెల నివాసాలు, బంధువుల ఇళ్లల్లో సీఐడీ అధికారులు రెండు రోజులపాటు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలలో సిబ్బంది, పని మనుషుల పేరుతో భూములు కొనుగోలు చేశారనడానికి ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఐడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.



Next Story