పాతబస్తీలో కత్తితో హడలెత్తిస్తున్న 19 ఏళ్ల అహ్మద్​ జాబ్రీ

by Dishafeatures2 |
పాతబస్తీలో కత్తితో హడలెత్తిస్తున్న 19 ఏళ్ల అహ్మద్​ జాబ్రీ
X

దిశ, చార్మినార్​: ఇంకా మూతి మీద మీసాలు కూడా రాని ఎంతో అమాయకంగా కనిపించే 19 సంవత్సరాల ఈ యువకుడు కత్తి పట్టాడంటే ఎవరైనా హడలెత్తిపోవాల్సిందే. ఇతగాడు రీల్స్​ పెట్టాడంటే సోషల్​మీడియాలో 10వేల లైక్​లు పడాల్సిందే.బైక్​ల పై ప్రాణాంతక స్టంట్స్.. కత్తులతో భయానక నృత్యాలు.. హుక్కా పీల్చే ఈ యువకుడి వీడియోలకు ఇన్​స్ట్రా లో 14వేల ఫాలోవర్స్​ ఉన్నారంటే ఇతగాడి రేంజ్​ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఇంతటితో అయిపోయిందనుకుంటే పొరపాటే. తాగుడుకు బానిసైన ఈ యువకుడు.. డబ్బుల కోసం కత్తి చేతబట్టి దారిదోపిడిలకు పాల్పడతాడు. కనిపించిన ఎంతటి వారినైనా కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసేదాక వదిలిపెట్టడు. ఏమాత్రం కనికరం లేకుండా ''కాట్​ దాల్తూం'' అంటూ బెదిరింపులకు పాల్పడుతాడు. అతని బెదిరింపులు పాతబస్తీలో రోజు రోజుకు అధికమయ్యాయి. తమను బెదిరించాడంటూ బాధితులు సయ్యద్​ మహ్మద్, షబ్బీర్​లు వేరు వేరుగా ఫిర్యాదు చేయడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు అహ్మద్​ జాబ్రిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.


చాంద్రాయణగుట్ట ఇన్​స్పెక్టర్​ కె ఎన్​ ప్రసాద్​ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఫారూఖీ అజ్మత్​నగర్​ తాళ్లకుంటకు చెందిన షేక్​ హసన్​బిన్​ ఆలీ అల్​ జాబ్రీకి ఆరుగురు కుమారులు. ఇద్దరు కుమారులు రౌడీషీటర్లు కాగా మరో ముగ్గురిపై సస్పెక్ట్​ రౌడీ షీట్ ఉంది. 6వ కుమారుడు షేక్​ అహ్మద్​ బిన్​ హసన్​ ఆలీ జాబ్రీ అలియాస్​ అహ్మద్​ జాబ్రీ (19) చదువుకోలేదు. చిన్న నాటి నుండే తన సోదరుల బాట బట్టాడు. అహ్మద్​ జాబ్రీ మద్యానికి బానిసయ్యాడు. చేతిలో డబ్బలు లేనప్పుడల్లా కత్తి చేతబట్టి దారిదోపిడీకి పాల్పడే వాడు. ఎంతటి వారినైనా అతి భయంకరంగా బెదిరించేవాడు. అంతేగాకుండా బైక్​లపై ప్రాణాంతక విన్యాసాలు చేయడం.. బరాత్​లో చాకులు ఎగరేస్తూ ఆడడం.. హుక్కా పీల్చిన వీడియోలను దర్జాగా ఇన్​స్ట్రా లో పోస్ట్​ చేస్తుంటాడు. ఇతడి పోస్ట్​కు కాసేపట్లోనే 10వేల లైక్స్​ పడుతాయి. 14వేల మంది ఫాలోవర్స్​ ఉన్నారంటే అహ్మద్​ జాబ్రీ రేంజ్​ ఎంతో ఇట్టే అర్థమవుతుంది. 18 సంవత్సరాలకే తన నేర చరిత్రను ప్రారంభించాడు. గత నెలలో సయ్యద్​ మహ్మద్​ ను కత్తితో బెదిరించి ముక్కుపై దాడిచేశాడు. అతని వద్ద నుంచి రూ.200 తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.


ఈ నెల 22వ తేదీన చాంద్రాయణగుట్ట ఇంద్రానగర్​లో షబ్బీర్​ నడిపిస్తున్న నూడుల్స్​ షాప్​కు వెళ్లాడు. అక్కడ నూడుల్స్​ ఆర్డర్​ చేయించుకుని తిన్నాడు. నూడుల్స్​ డబ్బులు అడిగిన యజమాని షబ్బీర్​పై తిరగబడ్డాడు. అతన్ని కత్తితో బెదిరించాడు. క్యాష్​ కౌంటర్​లో ఉన్న రూ.9వేల నగదుతో పరారయ్యాడు. ఇప్పటి వరకు చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​లో అహ్మద్​ జాబ్రీపై నాలుగు కేసులు నమోదయ్యాయి. సయ్యద్​ మహ్మద్, షబ్బీర్​ లు వేరు వేరుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి ఆ యువకుడిని చూసి ఇతడు కత్తితో బెదిరించాడా ? నో చాన్స్​ అని నవ్వేశారు. ఆ తర్వాత అహ్మద్​ జాబ్రీ లీలలు ఒక్కొక్కటిగా బయటపడడంతో ఇతడు మామూలోడు కాదు పక్కా ప్రొఫెషనల్​ క్రిమినల్​గా పోలీసుల దర్యాప్తులో తేలింది. వెంటనే అహ్మద్​ జాబ్రీని అరెస్ట్​ చేసి బుధవారం రిమాండ్​కు తరలించారు. ఈ కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed