- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుకు మేకల కాపరి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
పెద్దేముల్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం పెను విషాదాన్ని నింపింది.

దిశ, పెద్దేముల్ : పెద్దేముల్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం పెను విషాదాన్ని నింపింది. మేకలు మేపడానికి పొలాల్లోకి వెళ్లిన కాపరులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన కోడి ఆనందం, నిరటి నర్సింలు, జాను అనే ముగ్గురు మేకల కాపరులు ఎప్పటిలాగే బుధవారం ఉదయం మేకలను తోలుకుని గ్రామ శివారులోని పొలాల్లోకి వెళ్లారు. సాయంత్రం వేళ అకస్మాత్తుగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో ముగ్గురు కాపరులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే కోడి ఆనందం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అదే ప్రమాదంలో గాయపడిన నిరటి నర్సింలు, జానులకు తీవ్ర గాయాలయ్యాయి. పిడుగుపాటు ప్రభావంతో కాళ్లు, చేతులు పడిపోయి కదల్లేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన మేకల కాపరుల బతుకులు ఈ ప్రమాదంతో చిన్నాభిన్నమయ్యాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆనందం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.






