135 చైన్​స్నాచింగ్‌లకు పాల్పడ్డ యువకుడు .. పట్టించిన టీచర్ మంగళసూత్రం

by Disha Web |
135 చైన్​స్నాచింగ్‌లకు పాల్పడ్డ యువకుడు .. పట్టించిన టీచర్ మంగళసూత్రం
X

దిశ, చార్మినార్​ : సులభంగా డబ్బు సంపాదించడం కోసం చైన్​ స్నాచింగ్‌లను వృత్తిగా ఎంచుకున్నాడు ఓ 24 ఏళ్ల యువకుడు. ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్​చేస్తూ చైన్​ స్నాచింగ్‌లకు పాల్పడే అతడు.. పీడీ యాక్ట్​ కింద జైలుకు వెళ్ళొచ్చినా బుద్ధి మారలేదు. ఒకటి కాదు .. రెండు కాదు.. 135 చైన్​స్నాచింగ్‌లకు పాల్పడిన కరడుగట్టిన పాతనేరస్థుడు మొహమ్మద్ ఫైసల్ షా అలీ జాబ్రీతో పాటు మహ్మద్​ ఖలీల్‌ను సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు, శాలిబండా పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 120 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం పురాణిహవేలిలోని దక్షిణమండలం డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సౌజ్​జోన్​ డీసీపీ సాయి చైతన్య వివరాలు వెల్లడించారు.

ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో ప్రైవేట్​ ఉపాధ్యాయురాలు సుజాత (56) కూరగాయలు కొనుగోలు చేయడానికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా శంషీర్​గంజ్​ వద్ద బైక్​ పై వచ్చిన గుర్తు తెలియని అగంతుకులు ఆమె మెడలోంచి మంగళసూత్రం తెంపుకొని పరారయ్యారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాలిబండా పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఆ చైన్ లాగితే డొంక కదిలింది...

విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్​ జోన్​ టాస్క్‌ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​రాఘవేంద్ర బృందం శాలింబండా పోలీసులతో కలిసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాణ్ని అంగీకరించారు. పాతనేరస్థుడు బండ్లగూడకు చెందిన మొహమ్మద్ ఫైసల్ షా అలీ జాబ్రీ ఎలియాస్​అబ్దుల్లా, సోహైల్ (40), మహ్మద్​ ఖలీల్​(35) ఈ చోరీకి పాల్పడ్డారు. మహ్మద్ ఫైసల్ షా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో పుట్టి పెరిగాడు. అతను నాంపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూమ్ కళాశాలలో ఇంటర్మీడియట్‌ను మధ్యలో వదిలేశాడు. ఇంటర్మీడియట్ తర్వాత పంజాగుట్టలోని ఐసీఐసీఐ బ్యాంకులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సులువుగా డబ్బులు సంపాదించడం కోసం 2006 నుంచి నేరాల చిట్టాను తెరిచాడు. ఫైసల్​ షా 135 చైన్​ స్నాచింగ్​లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే లంగర్​హౌజ్, సుల్తాన్​బజార్​పోలీస్​ స్టేషన్‌లో పీడీ యాక్ట్​ కేసులు నమోదయ్యాయి.

ఏప్రిల్ 8వ తేదీన జైలు నుంచి విడుదలై వచ్చిన ఫైసల్​ షా తన ప్రవర్తనలో మార్పు రాకపోగా తన స్నేహితుడు ఖలీల్‌ను చెడడొట్టాడు. చైన్​స్నాచింగ్‌లతో సులభంగా డబ్బులు సంపాదించవచ్చని పథకం రూపొందించాడు. ఈ నేపథ్యంలోనే సెకండ్​ హ్యాండ్​ బైక్‌ను కొనుగోలు చేసి దానిపై చైన్​ స్నాచింగ్‌లకు పాల్పడే వారు. శాలిబండ, నారాయణగూడ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఖలీల్‌తో కలిసి ఫైసల్​షా మూడు చైన్​స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వారిరువురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఆరు లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ఫోర్స్​ డీసీపీ జి.చక్రవర్తి, సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ రాఘవేంద్ర, శాలిబండా ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్, ఎస్ఐలు నరేందర్, శ్రీశైలం, నర్సింహులు, సీనయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story