ఏపీలో 332 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్

by  |
ఏపీలో 332 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్ట వ్యాప్తంగా రెండోరోజూ 332కేంద్రాల్లో కొవిడ్​ వ్యాక్సినేషన్‌ కొనసాగింది. ఆదివారం 19,108 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 14,300 మాత్రమే. ఈ లక్ష్యానికి మించి టీకా కార్యక్రమం కొనసాగింది. దేశంలో కరోనా నియంత్రణ, నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం ఎలా ముందంజ వేసిందో వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియలోనూ అగ్రగామిగా నిలిచింది. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,291 మందికి వ్యాక్సిన్‌ వేశారు. జనాభా ప్రాతిపదికన వ్యాక్సిన్‌ వేసిన వారి సంఖ్య చూస్తే ఏపీలోనే అత్యధికంగా నమోదైయింది. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 21మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. ఆంధ్రప్రదేశ్‌ కంటే ఎక్కువ జనాభా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో 13,594 మందికి, మహారాష్ట్రలో 18,328 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఎక్కువ మందికి టీకా ఇచ్చిన జాబితాలోయూపీ ప్రథమస్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఏపీ, మూడో స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి.

శాస్త్రవేత్తలకు గవర్నర్‌ అభినందనలు

కొవిడ్​ను నిరోధించేందుకు రెండు దేశీయ టీకాలను విజయవంతంగా అభివృద్ది చేసిన భారత శాస్త్రవేత్తలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. నిరంతర పరిశోధనల ఫలితంగా అతి తక్కువ వ్యవధిలో టీకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినందుకు శాస్ర్తవేత్తలను గవర్నర్ ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఆరోగ్య కార్మికుల ప్రయోజనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ కరోనా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, వైద్య బృందాలను గవర్నర్ అభినందించారు.



Next Story

Most Viewed