55 మంది జర్నలిస్టులకు కొవిడ్ సాయం

by  |
55 మంది జర్నలిస్టులకు కొవిడ్ సాయం
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా బారిన పడ్డ జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా తక్షణ ఆర్థిక సాయం కింద రూ. 5.50 లక్షలు మంజూరైనట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ సాయం కింద 55 మంది జర్నలిస్టులకు రూ.10 వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. కరోనా రెండో దశలో.. జర్నలిస్టులే పెద్ద సంఖ్యలో బాధితులుగా మారారని వాపోయారు. బాధిత కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించి పెద్ద సంఖ్యలో తక్షణ సాయం మంజూరు చేశారని వారు తెలిపారు.

దురదృష్టవశాత్తు కొందరు జర్నలిస్టులు కూడా చనిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. వారికి సైతం పరిహారంగా రూ. 2 లక్షలు చొప్పున ప్రకటించారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టులను కష్ట కాలంలో పెద్ద మనసుతో ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మీడియా అకాడమీకి యూనియన్ నేతలు ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించండి..

కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో జర్నలిస్టు సోదరులు వార్తల సేకరణలో ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని టీయూడబ్ల్యూజే నేతలు సూచించారు. వీలైనంత వరకు చిన్న సంఘటనలకు వెళ్లకుండా స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ముఖ్యమైన ఘటనకు అందరూ వెళ్లకుండా.. ఒకరిద్దరు మాత్రమే వెళ్లి వార్త సేకరణ జరపాలని కోరారు. కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టిన తరువాత కూడా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జర్నలిస్టులకు సూచించారు.

Next Story

Most Viewed