సిద్ధిపేటలో నకిలీ కరెన్సీ కలకలం.. ఆందోళన వద్దన్న సీపీ..

by  |
సిద్ధిపేటలో నకిలీ కరెన్సీ కలకలం.. ఆందోళన వద్దన్న సీపీ..
X

దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేటను రాష్ట్రానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు కళ. కానీ వారి కళలు ఆడియాశలవుతున్నాయి. సిద్దిపేటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అవినీతిని రూపుమాపేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ను ఏర్పాటు చేశారు. అయినా సిద్దిపేటలో అవినీతి ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సిద్దిపేటలో దొంగనోట్ల ముద్రించి హైద్రాబాద్‌లో పట్టుబడ్డ సంఘటనే ఇందుకు నిదర్శనం. సిద్దిపేట వేదికగా ఇంత పెద్ద సంఘటన జరుగుతున్నా సిద్దిపేట పోలీసులు గుర్తించకపోవడంతో సామాన్యులు భయాందోళన చెందుతున్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వైఫల్యం చెందిందని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

సిద్దిపేటలో దొంగనోట్ల ముద్రణ…

సిద్దిపేట జిల్లా కేంద్రంగా సాగుతున్న నకిలీ నోట్ల ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. దొంగనోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించడంతో సిద్దిపేట దొంగనోట్ల బాగోతం బహిర్గతమైంది. సిద్దిపేటలోని భారత్ నగర్‌కు చెందిన చుక్కపురం సంతోష్ కుమార్ ఎంబీఏ పూర్తి చేసి ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫోటో స్టూడియో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సంతోష్ కు భారీగా డబ్బు అవసరం ఏర్పడింది. ఈ సమయంలోనే కొరియర్ బిజినెస్ చేసే సాయి కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అతను కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఈజీగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా సంతోష్ కుమార్ సాయితో కలిసి ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ కు ప్లాన్ వేశారు. దొంగనోట్లను చలామణి చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ సుంకరి శ్రీనివాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇందుకు గాను 10 శాతం కమీషన్ ఇస్తానని చెప్పారు. టెక్నికల్ సపోర్ట్ కోసం నీరజ్ కుమార్, రాజు అనే యువకులను గ్యాంగ్‌లో చేర్చుకున్నారు. డిగ్రీ చదువుతున్న నీరజ్, రాజు లు దొంగనోట్ల తయారీకి కావలసిన సామాగ్రిని ఏర్పాటు చేశారు. దందా కోసం రాఘవేంద్ర నగర్ కాలనీలో ఓ రూమును అద్దెకు తీసుకున్నారు. రూ.500, 200, 50 రూపాయలు ప్రింట్ చేయడం ప్రారంభించారు. లక్ష ఒరిజినల్ నోట్లు ఇచ్చిన వారికి మూడు లక్షల దొంగ నోట్లు ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఫేక్ కరెన్సీని సప్లై చేసుకునేందుకు హైదరాబాదులోని యూసఫ్‌గూడాలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ పోలీసులు ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇదే కాదు గత నెలలో బెజ్జంకిలో ను ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. బెజ్జంకి బ్యాంక్ లో ఒక వ్యక్తి నగదు డిపాజిట్ చేయడానికి వెళ్లగా అక్కడి బ్యాంకు అధికారులు ఒక రూ.500 నోటుని ఫేక్ కరెన్సీ గా గుర్తించారు.

భయాందోళనలో సామాన్యులు..

సిద్దిపేటలో దొంగ నోట్ల ముద్రిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పట్టణ, జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డబ్బులకు బాగా డిమాండ్ రావడంతో చాలా మంది డబ్బుల మార్పిడి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో ఏది ఫేక్ డబ్బు… ఏది రియల్ డబ్బో ఎలా గుర్తు పట్టాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై దొంగ నోట్ల దందాను గుర్తించి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలీస్ కమిషనరేట్ పై తీవ్ర విమర్శలు..

నూతన జిల్లాగా సిద్దిపేట ఆవిర్భావంతో పాటు కొత్తగా పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో అవినీతి అంతం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ కమిషనర్‌తో పాటు డీసీపీ, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐ లు, ఇంటిలిజెన్స్, టాస్క్ ఫోర్స్, ఇతర సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నా అవినీతిని అంతమొందించలేకపోతున్నారా అంటూ సామాన్యులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఫలం కారణంగా అభివృద్ధిలో రోల్ మోడల్ గా పేరు తెచ్చుకున్న సిద్దిపేట… అవినీతిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచేలా ఉందని విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి అవినీతిని అంతమొందించాలని కోరుతున్నారు. దీనిపై పోలీస్ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ప్రజలు ఆందోళన చెందొద్దు…

సిద్దిపేటలో దొంగ నోట్లు ముద్రించి హైదరాబాద్ లో పట్టుబడిన విషయంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిద్దిపేటలో ఇప్పటి వరకు అలాంటి లావాదేవీలు జరగలేదు. వాటి నివారణకు ప్రత్యేక నిఘా పెట్టాం. ఎవరికైనా అనుమానం వస్తే నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు.
-జోయల్ డేవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్

Next Story

Most Viewed