కేటీఆర్ మాట లెక్కచేయని కౌన్సిలర్.. ఏం చేశాడంటే..?

by  |
కేటీఆర్ మాట లెక్కచేయని కౌన్సిలర్.. ఏం చేశాడంటే..?
X

దిశ ప్రతినిధి, మెదక్ : సర్పంచ్ ఎవరో వాళ్లే తిరుగుర్రి .. సర్పంచ్ భర్త తిరుగుతడు .. కొడుకు, తమ్ముడు, బామ్మర్ది తిరుగుతడు .. అంటే నడవది. ఎవరికి జనం ఓట్లు వేసిర్రో వాళ్లే తిరుగుర్రి తప్పా వాళ్ల కొడుకు, భర్త తిరుగుతడంటే ఎట్లా. నేను కూడా మా భార్యను పంపియొచ్చు. కానీ పంపియ్యలే కదా. నేనే వచ్చి మీ ముంగట మాట్లాడుతున్నా కదా. ఎవరికి ఓట్లేస్తే వాళ్లే పని చేయాలే గని వేరే వాళ్లు పని చేస్తే ఎట్ల మరీ. మా ఆయన చూస్తాడంటే నడవదు అంటూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ రాజన్నసిరిసిల్ల జిల్లా పర్యటనలో మాట్లాడిన మాటాలు గతంలోనివి అయినా ఈ మధ్య దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. సిద్దిపేట జిల్లాలోని పలు అధికారిక సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడంపై ప్రతిపక్ష నాయకులు విమర్శస్తున్నారు. మహిళా స్థానంలో వారి భర్తలు, కొడుకులు పాల్గొన్న ఫోటోతో పాటు ఈ వీడియోను పోస్టు చేస్తూ … దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

సతులకు బదులు పతులు …

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిత సాధించడం కోసం 33 శాతంగా ఉన్న రిజర్వేషనను 50 శాతంకు పెంచింది. అయినా సిద్దిపేట జిల్లాలో మహిళా సాధికారితకు చోటు దక్కడం లేదు. మహిళా రిజర్వేషన్ స్థానాల్లో గెలుపొందిన చాలా మంది మహిళలు తిరిగి ఇంటికే పరిమితమవుతున్నారు. ప్రయివేటు మీటింగ్ లే కాదు .. అధికారిక సమావేశాల్లోనూ మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబ సభ్యులే పాల్గొంటున్నారు. దీనిపై పలుమార్లు విమర్శలు వ్యక్తమైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

గోడలపై రాతల్లోనూ భర్తలదే పెత్తనం …

కనీసం మహిళా ప్రజాప్రతినిధులు సమావేశాలకు హాజరుకాకపోయిన వారి పేర్లు మాత్రం గోడలపై ఉంటాయి. ఏ పని ప్రారంభించిన ఆ ప్రాంతానికి సంబంధించిన మహిళా ప్రజాప్రతినిధుల పేర్లు రాయడం సరైన ఆనవాయితీ . కానీ సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఇందుకు భిన్నంగా జరిగింది. ఏకంగా అధికారికంగా రాయించిన గోడలపై మహిళా ప్రజాప్రతినిధి గెలిస్తే ఆమె పేరుకు బదులు … భర్త పేరు రాయించారు. దుబ్బాక పట్టణంలోని 20 వ వార్డు కౌన్సిలర్‌గా లొంక రాజమణి గెలుపొందారు. కానీ 20 వ వార్డు కు సంబంధించిన వివరాలు గోడలపై రాసిన రాతల్లో కౌన్సిలర్ పేరు రాజమణికి బదులు అమె భర్త లొంక లచ్చయ్య అని రాసి ఉంది. దీన్ని చూసిన జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 20 వ వార్డు కౌన్సిలర్ మహిళా ప్రజాప్రతినిధి కాదా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పురపాలిక శాఖలో జరిగిన సంఘటనపై పురపాలిక శాఖ మంత్రి స్పందించాలని, గతంలో చెప్పినట్టు మహిళా ప్రజాప్రతినిధి స్థానంలో వారి భర్త పాల్గొనడం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సిద్దిపేటలోనూ ఇదే ఘటన …..

మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ఏకైక పురపాలక సంఘం… సిద్దిపేట మున్సిపాలిటీ. మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ 11 వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన దాసరి భాగ్యలక్ష్మి హాజరు కావాలి. కానీ అక్కడ అలా జరగలేదు. మహిళా ప్రజాప్రతినిధికి బదులు ఆమె పతి శ్రీనివాస్ హాజరయ్యారు. దీనిపై ‘దిశ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దిశ కథనానికి ప్రతిపక్షాలు, సామాన్యులు, అధికారి పార్టీ నాయకుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ ఘటన మరువకముందే తిరిగి దుబ్బాక మున్సిపాలిటీలోని ఓ వార్డు కౌన్సిలర్ నిర్వాహకం బహిర్గతం కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఐటీ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని, మహిళలకు ప్రత్యేక సముచిత స్థానం కల్పించాలని పలు మహిళా సంఘాల నాయకులు, ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్​ ఓ ముఠా నాయకుడు.. రేవంత్ సంచలన ఆరోపణ


Next Story