'కరోనాకు వ్యాక్సిన్ రాదు.. మనం మొండిగా ముందడుగు వేయడమే'

by  |
కరోనాకు వ్యాక్సిన్ రాదు.. మనం మొండిగా ముందడుగు వేయడమే
X

లండన్/రోమ్: కరోనా వైరస్‌ నిర్మూలనకు వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారమని.. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న పలు వ్యాక్సిన్లు రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుండగా, ఇంగ్లండ్, ఇటలీ ప్రధానులు అందుకు భిన్నంగా స్పందించారు. అయితే, లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తన పరిశోధన సత్ఫలితాలను ఇస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వ్యాక్సిన్ ఇప్పట్లో రాదని ఇటలీ ప్రధాని గిలెప్పి, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారికి చైనా తర్వాత కేంద్ర బిందువుగా మారిన ఇటలీ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. నిర్ణయించిన తేదీ కంటే ముందే అక్కడ రెస్టారెంట్లు, బార్లు, బీచ్‌లను తెరిచారు. ఈ నేపథ్యంలోనే ఇటలీ ప్రధాని గిలెప్పీ మాట్లాడుతూ సమీప భవిష్యత్‌లో కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని.. వైరస్‌తో కలసి ముందుకు వెళ్లడమే మనకున్న అవకాశం అని ఆయన అన్నారు. ముప్పు ఇంకా తొలగిపోలేదని తెలుసు.. కానీ, వ్యాక్సిన్ వచ్చే వరకు వేచి చూడలేమన్నారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. కరోనా వ్యాక్సిన్ ఇక ఎప్పటికీ అందుబాటులోకి రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా.. ప్రజలందరికీ అందుబాటులోనికి రావడానికి చాలా సమయం పడుతుందన్నారు. మొండిగా ముందుకు వెళ్లడం తప్ప మనకు వేరే మార్గం లేదని.. ఈ వాస్తవాన్ని అందరం గ్రహించాలని బోరీస్ అన్నారు. కాగా, ఆయన పరిధిలోని ఆక్స్‌ఫర్డ్‌లోనే వ్యాక్సిన్ పరిశోధనలు విజయవంతంగా ముందుకు సాగుతుండటం గమనార్హం.



Next Story

Most Viewed