కొవిడ్ నిబంధనలు ప్రజలకేనా?

by  |
కొవిడ్ నిబంధనలు ప్రజలకేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అంటూ ప్రధాని మోడీ మొదలు ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు అందరూ చాలా ఆర్భాటంగా చెప్తున్నారు. కానీ వీరెవరూ దాన్ని ఆచరించడంలేదు. కేవలం ప్రజలు మాత్రమే పాటించాలన్న తీరులో వీరి ప్రకటనలు ఉంటున్నాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలోనే మాస్కులు లేకుండా, సోషల్ డిస్టెన్స్ లేకుండా వందలాది మందితో కార్యక్రమాలు నిర్వహించిన పార్టీల నేతల ఇప్పుడు అన్‌లాక్ ఐదవ దశలోకి వచ్చిన తర్వాత కొవిడ్ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. రామమందిర నిర్మాణానికి భూమిపూజ, కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం మొదలు కేబుల్ బ్రిడ్జి ఓపెనింగ్, తాజాగా భువనగిరి జిల్లాలో జరిగిన కార్యక్రమాల వరకు సోషల్ డిస్టెన్స్ నిబంధన మచ్చుకైనా కనిపించలేదు.

ఇక రాష్ట్ర పీసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మూడు రోజుల పాటు వరుసగా నిర్వహించిన సమావేశాల్లోనూ ఇదే తంతు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమాలుగానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరసన ప్రదర్శనల్లోనూ సోషల్ డిస్టెన్స్ నిబంధన కాగితాలకే పరిమితమైంది. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఈ నేతలంతా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం విరుద్ధంగా ప్రవర్తించారు. ఒకవంక కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా అంతా అదుపులోనే ఉందంటూ ప్రకటనలు ఇవ్వడం, సహజీవనం తప్పదనే సందేశానికే పరిమితమయ్యారు. ప్రధాని మోడీ ‘దో గజ్ కీ దూరీ’ అని చెప్పినా, ముఖ్యమంత్రి కేసీఆర్ ‘భౌతిక (ఫిజికల్) దూరం’ అని చెప్పినా అది మాటలకే పరిమితమైంది.

తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించే సమావేశాల్లో సోషల్ డిస్టెన్స్ అనే నిబంధన ఉందా అనే అనుమానం కలుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదుచేయించాలని అవగాహన కలిగించే సమావేశాల్లోనూ అన్ని పార్టీల నేతలదీ ఇదే ధోరణి. తొలుత ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్ వినియోగం, ఖాళీ సీట్ల ఏర్పాటు లాంటివన్నీ కనిపించినా ఇప్పుడు అన్ని సీట్లనూ నింపేసి స్టాండింగ్ ప్యాసింజర్లతో నడుపుతున్నారు డ్రైవర్లు, కండక్టర్లు. సచివాలయం కూల్చివేత దృశ్యాలను చూపించడానికి హైకోర్టు ఆదేశాల మేరకు మీడియాను తీసుకెళ్ళిన పోలీసులు కూడా వీడియో జర్నలిస్టులను వ్యాన్‌లో కుక్కేశారు.

దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో అక్కడికి వెళ్ళిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు వందల సంఖ్యలోనే ఉన్నారు. అంతిమ యాత్రలకు నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే ఉండాలని నిబంధన విధించిన ముఖ్యమంత్రే దానికి విరుద్ధంగా వ్యవహరించారు. ఇక పెళ్ళిళ్ళకు సైతం పరిమిత సంఖ్యలోనే ఉండాలన్న నిబంధన సైతం సామాన్యులకు మాత్రమే తప్ప వీఐపీలకు కాదనే తీరులో ఇటీవల కొన్నింటికి ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళ సమయంలో క్షేత్రస్థాయి పర్యటనలో చూపించడానికి తీసుకెళ్ళిన మంత్రి తలసాని, పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం సోషల్ డిస్టెన్స్ నిబంధనను గాలికొదిలేశారు. ఇక అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన బీజేపీ స్థానిక నేతలు సైతం ఈ నిబంధనను బుట్టదాఖలా చేశారు.

ఈ నిబంధననను అమలుచేయాలంటూ రాష్ట్ర వైద్య విద్య శాఖ డైరెక్టర్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ లాంటివారు చాలా గట్టిగా పిలుపు ఇస్తూ ఉంటారు. ప్రతీరోజూ విడుదల చేసే బులెటిన్‌లో నొక్కిచెప్తూ ఉంటారు. కానీ దాన్ని పాటించాల్సిన, అమలుచేయాల్సిన అదికారులు మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం, ఆ తర్వాత అక్కడ గుమికూడిన వందలాది మంది గురించి ఈ ఇద్దరు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారుగానీ దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చి వందలాది మందిని ఆహ్వానించి ప్రారంభోత్సవం చేసిన మంత్రి, అధికారుల విషయంలో మాత్రం పట్టీపట్టనట్లుగానే వ్యవహరించారు. సీఎం కేసీఆర్ ఇటీవల యాదాద్రి ఆలయాన్నిసందర్శించిన సందర్భంగా కూడా గుమికూడడం యధావిధిగానే కొనసాగింది.

ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులే యధేచ్ఛగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే ఇక సామాన్యులకు ఈ నిబంధన ఎందుకు వర్తిస్తుందనే చర్చలు కూడా లేకపోలేదు. కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతించే తీరులో మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడి మరీ నియోజకవర్గ కేంద్రాల్లో, పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో కార్యకర్తలతో కలిసి ప్రయాణించారు. ఎంతమందికి వైరస్ వచ్చినా ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడమే తప్ప దానిబారిన పడకుండా ఉండేందుకు పాటించాల్సిన సోషల్ డిస్టెన్స్ నిబంధనను మాత్రం అటకెక్కించారు అధికారులు, పార్టీల నేతలు. దుబ్బాకలో పీసీసీ చీఫ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు నిర్వహించిన ర్యాలీని చూస్తే సోషల్ డిస్టెన్స్ నిబంధన పట్ల వీరికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.

కార్యక్రమాలను నిర్వహించే పార్టీల నేతలు, అధికారులతో పాటు పాల్గొంటున్న కార్యకర్తలు, ప్రజలకు కూడా సోషల్ డిస్టెన్స్ నిబంధన పట్ల సీరియస్‌నెస్ లేదు. అది కాగితాలకే పరిమితమైంది. అమలుకు నోచుకోని ఎన్నో నిబంధనల్లో ఇది కూడా ఒకటి. అమలుచేయించేవారికీ చిత్తశుద్ధి లేదు, పాటించాల్సిన ప్రజలకూ పట్టింపు లేదు.

Next Story

Most Viewed