మూతపడుతున్నాయి.. నష్టాల ఊబిలో ఆతిథ్యరంగం

by  |
మూతపడుతున్నాయి.. నష్టాల ఊబిలో ఆతిథ్యరంగం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏడాది కాలంగా హోటళ్ల రంగాన్ని కరోనా కకావికలం చేస్తోంది. కేవలం హోటళ్లే కాదు.. మడిగలల్లో, తోపుడు బండ్లపై టిఫిన్లు విక్రయించేవారు సైతం చితికి పోతున్నారు. గతేడాది లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు పడి కోలుకుంటున్న తరుణంలోనే కరోనా సెకండ్ వే పంజా విసురడంతో హోటల్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడింది. ఐదు నక్షత్రాలు, మూడు నక్షత్రాల హోటళ్లు, రెస్టారెంట్లు కరోనాతో సంక్షోభంలో కూరుకుపోవడంతో విద్యుత్ బిల్లులు,అద్దెలు, నిర్వహణ ఖర్చులు, పనిచేసే వర్కర్ల ఖర్చులు భారంగా మారడంతో ఇప్పటికే 90 శాతం మూతపడ్డాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దవి, చిన్నవి హోటళ్లు కలిపి సుమారు 20వేలకు పైగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోనే15వేల వరకు ఉన్నాయి. వీటిపై 10లక్షల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కో రెస్టారెంట్ నిర్వహించాలంటే రూ.10లక్షలపైనే పెట్టుబడి అవుతుంది. బిజినెస్ నడిచినా, నడవక పోయినా అద్దెలు, కార్మికుల జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే. సాధారణంగా ఒక్క హోటల్‌ను నడిపించాలన్నా ఐదు నుంచి 10 గదుల వరకు ఉండాల్సిందే. 70 శాతం హోటళ్లు అద్దెభవనాల్లోనే నడుస్తున్నాయి. అంటే నెలకు సుమారు లక్ష రూపాయల అద్దె ఉంటుంది. దీనికి తోడు అందులో వర్కర్లు సుమారు 20 మందికి పైగా పనిచేయడం వారికి ఆహార సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. ఆహార తయారీకి సంబంధించిన మిషన్ల వినియోగం, ఫ్యాన్లు, లైట్లకు వినియోగించే విద్యుత్ ను కమర్షియల్ పరిధిలో చెల్లించడంతో వేల రూపాయల్లో చెల్లించాల్సి వస్తోందని పలువురు హోటళ్ల నిర్వహకులు పేర్కొంటున్నారు. కరోనాతో హోటళ్లలో ఫుడ్, బేవరేజెస్ అమ్మకాలు, ఈవెంట్స్ నిర్వహణ లేక పోవడంతో ఆదాయం తగ్గింది. వివిధ పనుల నిమిత్తం రెస్టారెంట్లకు వచ్చి బస చేసేవారు లేక పోవడంతో 80 శాతం ఉన్న అదాయం 20 శాతానికి పడిపోయింది. ప్రతి రోజూ రూ.50 కోట్లపైగా వ్యాపారం సాగేది. ఇప్పడు జీరోకు చేరడంతో పెద్దహోటళ్ల నిర్వహణ ఖర్చులు సైతం వెళ్లకపోవడంతో నిర్వహకులు మూసివేశారు.

పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లకు బల్క్ బుకింగ్స్ తోనే ఆదాయం వచ్చేది. అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లు, వేడుకలు, పార్టీలు, పంక్షన్లు, సినిమా షూటింగ్స్ వీటికి ప్రధాన ఆదాయ వనరులు. అయితే పరిశ్రమల స్థాపనకు వివిధ, రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చేవారు హోటళ్లలోనే ఉండేవారు. సమావేశాలు నిర్వహించి బల్క్ ఆర్డర్లు చేసేవారు. అయితే కోవిడ్ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలతో ఇతర ప్రాంతాల నుంచి రాకపోవడంతో హోటల్ ఇండస్ట్రీకి ఎఫెక్ట్ పడింది. నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఇదిలా ఉంటే హోటల్స్ రంగంలో పని చేసే కార్మికులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. రాష్ట్రానికి చెందిన వారితో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిస్సా, చత్తీష్ ఘడ్, జార్ఖండ్ కు చెందిన వారు పని చేస్తున్నారు. అయితే ఫస్ట్ వే కరోనాతో లాక్ డౌన్ విధించడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారంతా వెళ్లిపోయారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత తిరిగి హోటళ్ల నిర్వహకులు కొంత మంది కార్మికులకు తీసుకొచ్చారు. అయితే మళ్లీ సెకండ్ వే తో కార్మికులంతా వెళ్లిపోయారు.

అంతంత మాత్రంగానే నడిచే ఫుడ్ కోర్టుల నుంచి ఆర్డర్స్ చేసే వారు కూడా తగ్గడంతో , ప్రజలు ఇంటిఫుడ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో గిరాకీలు తగ్గాయి. ఆన్ లైన్ ఆర్డర్లు చేసేవారు సైతం తగ్గడంతో కంపెనీలతో పాటు లక్షలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండాపోయింది. టూరిజంపైనే హోటల్ ఇండస్ట్రీ ఎక్కువగా ఆధారపడి మనుగడ సాగిస్తుంది. అయితే కరోనా మహమ్మారీతో పలు రాష్ట్రాలతో పాటు విదేశీ పర్యాటకులపై ఆంక్షలు ఉండటంతో ఎవరూ రావడం లేదు. ఒకప్పుడు హోటళ్లలో రూముల బుకింగ్ కోసం పోటీ పడేవారు. అయితే ఇప్పడు అసలు పర్యాటకులు రాకపోవడంతో బిజినెస్ లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే 10 శాతం ఉన్న హోటల్స్ కూడా మూసివేసే పరిస్థితి ఉందని హోటళ్ల నిర్వహకులు పేర్కొంటున్నారు.

హోటల్స్ రంగం కోలుకోవాలంటే…

ట్రెడ్ లైసెన్సులు, ప్రాపర్టీ టాక్సీ రాయితీ. జీఎస్టీ రద్దు చేయాలి. విద్యుత్ బిల్లులు మినహాయింపు, అత్యావసర సేవగా ఇండస్ట్రీని గుర్తించడం. కేంద్ర ప్రభుత్వమే కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ లు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి.

హోటల్స్ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

కరోనాతో హోటల్ రంగం పూర్తిగా దెబ్బతిన్నది. నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కోట్ల రూపాయల్లో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తుంది హోటల్ రంగమే. గతేడాది లాక్ డౌన్ తో పూర్తిగా నష్టపోయాం. కోలుకుంటున్న తరుణంలో కరోనా సెకండ్ వేతో ఇప్పటికే 90 శాతం మూసివేశారు. ప్రభుత్వం హోటల్ ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే జీఎస్టీ రద్దు చేయాలి. విద్యుత్ బిల్లులు మినహాయింపుతో పాటు ట్రెడ్ లైసెన్సులు, ప్రాపర్టీ టాక్సీలో రాయితీ ఇవ్వాలి. -ఎస్. వెంకట్ రెడ్డి, రాష్ట అధ్యక్షుడు, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్

బకాయిలు విడుదల చేయాలి

లాక్ డౌన్ తో హోటల్స్ రంగం నష్టాల్లో కూరుకుపోయింది. కరోనాకు ముందు నెలకు రూ.50కోట్లపైగా బిజినెస్ నడిచేది. టాక్స్ ల రూపంలో ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో చెల్లించేవారం. అయితే లాక్ డౌన్ తో అద్దెలు, కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లులుచెల్లించలేక నిర్వహకులు మూసివేస్తున్నారు. ప్రభుత్వం హోటల్ ఇండస్ట్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే కొంత ఊరట నిచ్చినట్లవుతుంది. అదే విధంగా కార్మికులకు లాక్ డౌన్ తో ఈఎస్ఐ, పీఎఫ్ కూడా చెల్లించలేక పోతున్నాం. కేంద్రమే వాటిని భరించాలి. – కంచర్ల అశోక్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్



Next Story

Most Viewed