కరోనా కొత్త వేరియంట్ టెన్షన్.. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే?

by Disha Web Desk 2 |
కరోనా కొత్త వేరియంట్ టెన్షన్.. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త కొవిడ్ (జేఎన్ –1) వ్యాప్తిపై జనాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేఎన్ 1 వేరియంట్‌తో ఎలాంటి తీవ్రమైన సమస్యలు ఉండవని నొక్కి చెబుతున్నారు. ఈ వైరస్ ఎక్కువ మందిలో అసింప్టమాటిక్ (లక్షణాలు కనిపించకుండా)గా వచ్చిపోతుంటే, మరి కొందరిలో ‘కామన్ వైరల్ ఫీవర్’ తరహాలో లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అతి తక్కువ మందిలో జలుబు, ముక్కుకారడం, ఒళ్లు నొప్పులు లైట్ ఫీవర్ వంటి లక్షణాలు బయటపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని నెలల కిందే ఈ వేరియంట్ ను గుర్తించగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్క పేషెంట్‌కు కూడా బ్రీతింగ్ సమస్య రాలేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. వైరస్ మ్యూటేషన్ (స్వభావం మార్చుకోవడంలో) కొంత కేసుల వ్యాప్తి ఉన్నప్పటికీ, భయపడాల్సిన అవసరం లేదని మన స్టేట్ లోని డాక్టర్లు కూడా వెల్లడిస్తున్నారు.

జేఎన్ 1 వేరియంట్ వెరీ వీక్ గా ఉన్నదని వివరిస్తున్నారు. ఇప్పటికే కొవిడ్ జేఎన్ –1 ప్రభావం తక్కువేనని డబ్ల్యూహెచ్ఓతోపాటు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కూడా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి చెందగా, మన దేశంలో కేరళలో ఫస్ట్ కేసులు తేలాయి. గత నెల 18వ తేదీన అక్కడ కేసులు తేలినా.. ప్రభావం లేదని గుర్తించారు. మైల్డ్ సింప్టమ్స్ తో వైరస్ వచ్చిపోతుందని కేరళ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. గోవా, మహరాష్ట్రలో కేసులు తేలుతుండగా, మన దగ్గర ఇప్పటి వరకు అధికారికంగా జేఎన్ 1 కేసులు తేలలేదు. కానీ తీవ్రమైన శ్వాస సమస్యలతో ప్రభుత్వాస్పత్రులకు వచ్చిన ప్రతీ పేషెంట్ శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ (జన్యు నిర్ధారణ) టెస్టులకు పంపాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది.

లక్షణాలను బట్టే వైద్యం!

గతంలో పోల్చితే ప్రస్తుతం మార్కెట్లో కరోనా వైరస్ ను మ్యూటేషన్లతో సంబంధం లేకుండా తీవ్రతను అడ్డుకునే యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో వందకు వంద శాతం కరోనా ఎన్ని మ్యూటేషన్లు పొంది వ్యాప్తి చెందినా, సులువుగా అడ్డుకోవచ్చని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. జేఎన్1 వేరియంట్ లో కనిపిస్తున్న జలుబు, ముక్కుకారడం, బాడీ పెయిన్స్, ఫీవర్ కు రెగ్యులర్ గా వాడే మందుల చికిత్స సరిపోతుందని వెల్లడిస్తున్నారు. బలహీనమైన వేరియంట్ తోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లు వైద్యులు వివరిస్తున్నారు.

హైరిస్క్ కేటగిరీ..

ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్భిణులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని చెబుతున్నారు. మార్కెట్లు, జన సామూహిక ప్రదేశాల్లో మాస్కులు విధిగా ధరించాలని కోరుతున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. దీంతో పాటు హైపర్ టెన్షన్, డయాబెటిస్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ వంటి వ్యాధిగ్రస్తులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు పేర్కొంటున్నారు.

వైరస్ ఎఫెక్ట్ వెరీ ‘లో’: డాక్టర్ కిరణ్ మాదాల, హెల్త్ ఎక్స్ పర్ట్

కొత్తగా వ్యాప్తి చెందుతున్న జేఎన్ 1 వైరస్ ఒమిక్రాన్ లోని సబ్ వేరియంట్. దీంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్ గ్రోత్, సివియారిటీ ఉండదని డబ్ల్యూహెచ్ఓ కూడా స్పష్టంగా పేర్కొన్నది. పైగా మన దేశంలో వ్యాక్సినేషన్ సమర్థవంతంగా జరిగింది. అందుకే రెండు నెలల కిందట వైరస్ ఎంట్రీ అయినా..పేషెంట్లెవ్వరికీ తీవ్రమైన సమస్యలు రాలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 30 శాతం వ్యాప్తి కొనసాగుతున్నది. మెజార్టీ ప్రజల్లో మైల్డ్ సింప్టమ్స్ తో వైరస్ వచ్చిపోతున్నది. రెగ్యులర్ మెడికేషన్ పాటిస్తే సులువగా తగ్గిపోతుంది. శీతల వాతావరణ పరిస్థితుల్లో సహజంగానే వైరస్ తన ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు రావు.


Next Story