మావోయిస్టులను పోలీసులకు పట్టించిన కరోనా

by  |
మావోయిస్టులను పోలీసులకు పట్టించిన కరోనా
X

దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా వైరస్ మావోయిస్టులను పట్టించిన ఘటన వరంగల్ కమిషనరేట్ పరిధి ములుగు క్రాస్‌రోడ్డు వద్ద మంగళవారం వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి బుధవారం పూర్తి వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ములుగు నుంచి వస్తున్న ఓ కారు వెనుకభాగంలో అనుమానస్పదంగా ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా మావోయిస్టు పార్టీకి చెందిన.. దండకారణ్య స్పెషల్ జోన్ డివిజినల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ ఆలియాస్ మోహన్ ఆలియాస్ శోబ్రాయ్, మరో వ్యక్తి మావోయిస్టు పార్టీ కొరియర్ బందుగ వినయ్‌లుగా తేలింది.

వెంకటాపూర్ అటవీ ప్రాంతంలో కొవిడ్‌తో బాధపడుతున్న గడ్డం మధుకర్‌ను హన్మకొండకు తీసుకొచ్చేందుకు బందుగ వినయ్‌‌ ప్రణాళిక చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రికి తీసుకొచ్చేక్రమంలో ములుగు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులకు చిక్కినట్టు సీపీ వివరించారు. అదే సమయంలో వారి వద్ద ఉన్న రూ. 88,500 స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం కొవిడ్ పేషెంట్‌ను హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మావోయిస్టుల్లో మరో 12 మందికి కూడా కరోనా సోకిందన్నారు. వైరస్ బారీన పడ్డవారిలో కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, తిప్పరి తిరుతి అలియాస్ దేవుజీ, యాప నారాయణ అలియాస్ హరిబూషణ్, బడే చోక్కారావు అలియాస్ దామోదర్, కటకం రాజిరెడ్డి అలియాస్ ధర్మన్న, కట్టా రాంచందర్ రెడ్డి అలియాస్ వికల్స్, ములా దేవేందర్ రెడ్డి అలియాస్ మాస దడ, కున్ కటి వెంకటయ్య అలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ అలియాస్ రఘు, కొడి మంజుల అలియాస్ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత అలియాస్ బుర్రా ఉన్నారు. కరోనా సోకిన మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం చికిత్స చేయించేందుకు సిద్ధంగా ఉందని సీపీ తరుణ్ జోషి స్పష్టం చేశారు.


Next Story

Most Viewed