ఏపీలో కరోనా తీవ్రత ఎంత?

by  |
ఏపీలో కరోనా తీవ్రత ఎంత?
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తూ కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. కరోనా టెస్టులు చేయడంలో ఏపీ నెంబర్ వన్ అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డిశ్చార్జ్‌ల రేటు గణణీయంగా ఉందని వైద్యఆరోగ్య శాఖ వెల్లడిస్తుంది. కరోనా మరణాలు కూడా స్వల్పంగానే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే గణాంకాలు మాత్రం ప్రభుత్వ లెక్కలకు విరుద్దంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే కేవలం రెండు జిల్లాల్లోనే వెయ్యికి తక్కువగా కేసులు నమోదయ్యాయి.

అందులో శ్రీకాకుళం జిల్లా వెయ్యికి కేవలం ఐదు కేసుల దూరంలోనే ఉంది. ఇక విజయనగరం జిల్లాలో కూడా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ సామాజిక వ్యాప్తిలో కాస్త జాగ్రత్తలు పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ జిల్లాలో 633 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. అనంతపురం (3,290), గుంటూరు (3,019), కర్నూలు (3,405) జిల్లాల్లో పాజిటివ్ కేసులు ప్రమాదకరంగానే ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో పాజిటివ్ కేసులు మూడు వేలకు పైగానే నమోదయ్యాయి.

ఇక చిత్తూరు (2,668), తూర్పుగోదావరి (2,642), కృష్నా (2,504) జిల్లాల్లో రెండు వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కడప (1,786), నెల్లూరు (1,155), ప్రకాశం (1,172), విశాఖపట్టణం (1,377), పశ్చిమ గోదావరి (1,690) జిల్లాల్లో పాజిటివ్ కేసులు వెయ్యికిపైగా నమోదయ్యాయి. ఏపీలో పదకొండు లక్షలకు పైగా టెస్టులు చేశారు. డిశ్చార్జ్‌కి రెట్టింపు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో దిగిన వారిని దిగినట్టే క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.

క్వాంరటైన్ కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. రోజూ క్వారంటైన్ కేంద్రాలకు పదుల సంఖ్యలో పాసింజర్లు వస్తున్నారు. వీరందరికీ కాలేజీల్లో ఉంచుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఒకటి లేదా రెండు మాత్రమే టాయిలెట్లు ఉంటున్నాయి. వీటినే అందరూ వినియోగించాల్సి ఉంటోంది. కరోనా వచ్చిన వ్యక్తి నుంచి ఇక్కడే ఇతరలకు సోకుతున్న అనుమానాలున్నాయి. మరోవైపు క్వారంటైన్ కేంద్రాల్లోకి తెచ్చిన వారిని ఎన్ని రోజులు ఉంచుతారు? పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలు ఎప్పుడొస్తాయి? వంటి వివరాలు స్పష్టంగా చెప్పేందుకు ఎవరూ అందుబాటులో ఉండరు. దీంతో క్వారంటైన్ కేంద్రాల నుంచి పలువరు పరారవుతున్నారు. దీంతోనే కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఆరోపణలున్నాయి.


Next Story

Most Viewed