ఇది చూసి ఆశ్చర్యపోతున్న జీహెచ్ఎంసీ

by  |
ఇది చూసి ఆశ్చర్యపోతున్న జీహెచ్ఎంసీ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా అడ్రస్​టు లెట్ లోకి మారిపోతున్నది. ఇదేంటి అనుకుంటున్నారా ? అవును ఇది ముమ్మాటికీ నిజం. వైరస్​ సోకిందనే అనుమానం ఉన్న వారు టెస్టులు చేయించుకొని టు లెట్​బోర్డులు ఉన్న ఇళ్ల తమ చిరునామాను వైద్యాధికారులకు అందజేస్తున్నారు. పాజిటివ్​ వస్తే ఇళ్ల చుట్టు పక్కల వారు తమను చిన్నచూపు చూస్తారనే భయంతో తప్పుడు చిరునామా అందజేస్తున్నారు. ముఖ్యంగా ఇది యూపీహెచ్​సీలు, బస్తీ దవాఖానల్లో అధికంగా కనబడుతోంది.

కరోనా లక్షణాలున్న వారు తమ సమీపంలోని ర్యాపిడ్ టెస్టులు చేసే దవాఖానలకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే అక్కడ అడ్రస్ లు మాత్రం తప్పుగా ఇస్తున్నారు. హాస్పిటల్స్ లో అధికారులు వారు ఇచ్చిన అడ్రస్ లు నమోదు చేసుకుని పరీక్షలు చేస్తున్నారు. ఇలా టెస్టులు చేయించుకున్న వారికి పాజిటివ్ రిపోర్టు వస్తే వారి వివరాలు మహా నగర పాలక సంస్థ అధికారులకు చేరుతుంది. దీంతో అధికారులు ఆయా ప్రాంతాలను గుర్తించి శానిటైజ్ చేసి వైరస్ ఇతరులకు సోకకుండా చర్యలు తీసుకుంటారు. ఇలా పాజిటివ్ వచ్చిన అడ్రస్​లకు వెళ్లిన జీహెచ్ఎంసీ సిబ్బంది అలాంటి పేరు ఉన్న వారు ఇంట్లో ఉండడం లేదని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఏదో ఒకటి రెండు ఘటనల్లో ఇలా జరిగిందంటే అడ్రస్ తప్పుగా నమోదు చేశారేమోననే అనుమానాలు తలెత్తేవి. కానీ, ఇవి పదుల సంఖ్యలో ఉంటుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు కారణమేమిటా అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బహిర్గతమయ్యాయి.

తప్పడు అడ్రస్ లన్నీ.. అవే

కరోనా రోజురోజుకూ పెరిగిపోతుండడంతో చాలామంది ప్రజలు నగరాన్ని వదిలి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ ఇళ్లకు టు లెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాటి చిరునామాలను కరోనా లక్షణాలున్న రోగులు నమోదు చేసుకొని వైద్య పరీక్షలు చేయించుకున్న దగ్గర ఇస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇలా నగరంలోని చాలా చోట్ల ఉన్నప్పటికీ గోషామహల్ నియోజకవర్గం పరిధిలో అధికంగా ఉంది. బేగంబజార్, ముక్తియార్ గంజ్, ఉస్మాన్ గంజ్, రిసాలా అబ్దుల్లా , ఫీల్ ఖాన వంటి ప్రాంతాల్లో హోల్ సేల్ వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇక్కడికి జిల్లాల నుంచి కొనుగోలు నిమిత్తం వ్యాపారులు నిత్యం వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉన్నవారు నగరంలోని యూపీహెచ్​సీ, బస్తీ దవాఖానల్లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. స్థానికులు కాకపోతే పరీక్షలు చేయరనే అనుమానంతో టు లెట్ బోర్డులు ఉన్న ఇంటి అడ్రస్ లు సేకరించి టెస్ట్ ల సమయంలో ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

హోం క్వారంటైన్ లో ఉంటున్నారా ..?

జిల్లాల నుంచి నగరానికి వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్న వారిలో పాజిటివ్ వచ్చిన వారు మందులు కొనుగోలు చేసుకొని తిరిగి తమ సొంత ఊరికి వెళ్లి హోం క్వారంటైన్​లో ఉంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గ్రామాల్లో కరోనా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ వస్తే స్థానికంగా అందరికీ తెలిస్తే ఇబ్బందుల పాలవుతామని భావిస్తున్నారు. దీంతో నగరంలో ఎవరికీ తెలియకుండా పరీక్షలు చేయించుకుని తిరిగి ఇంటికి వెళ్లి క్వారెంటైన్ ఉండవచ్చనే ఆలోచనతో ఇలా చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed