పరిమితంగానే… పూల పండగ!

by  |
పరిమితంగానే… పూల పండగ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈసారి బతుకమ్మ వేడుకలకు కరోనా బ్రేక్ వేయనున్నది. రాష్ట్ర ప్రభుత్వ అధికార పండుగ అయినప్పటికీ పరిమితంగానే వేడుకలు జరుగనున్నాయి.. ప్రభుత్వం ఆర్భాటం చేయడానికి బదులుగా ప్రజలే స్వచ్ఛందంగా నియంత్రణ పాటించనున్నారు. బోనాల పండుగను పరిమితంగా జరుపుకున్నట్లుగానే ఇప్పుడు బతుకమ్మ సంబురాలు కూడా నిరాడంబరంగా జరగనున్నాయి.

‘ఓనం’ ఎఫెక్ట్ ‘బతుకమ్మ’ మీద..

కేరళ ఓనం పండుగలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని నిర్వహించుకున్న కారణంగా ఊహించని స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందింది. ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించినట్లు తెలిసింది. కరోనా వైరస్ మన దేశంలో తొలుత కేరళలో నమోదైనప్పటికీ కట్టుదిట్టమైన చర్యలతో వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుని రోల్ మోడల్‌గా నిలిచింది. అయితే కరోనా సద్దుమణిగిదనే అభిప్రాయంతో ఉన్న ప్రజలు ఓనం పండుగ నేపథ్యంలో ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చి ఉత్సాహంగా జరుపుకున్నారు. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ లాంటి నిబంధనలను నామమాత్రంగానే పాటించారు. చివరకు వైరస్ వ్యాప్తి ఉధృతమై ఇప్పుడు వేల సంఖ్యలో ప్రతిరోజూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి.. దేశంలోనే టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో ఒక్కటిగా నిలిచి, మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరమయ్యాయి.

కనిపించని ఎత్తైన బతుకమ్మలు..

తెలంగాణలో కేరళలాంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా పరిమితంగానే ఈ వేడుకలను నిర్వహించాలని భావిస్తోంది. ఎత్తయిన బతుకమ్మలు, వేలాది మంది మహిళలు సమీకరించడం లాంటి సాహసాలకు పోకుండా ప్రజలే స్వీయ నియంత్రణ పాటిస్తూ ఎక్కడికక్కడ సంబురాలు జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయనుంది. పండుగలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెలువరించిన అన్‌లాక్-5 మార్గదర్శకాల్లో గరిష్టంగా వంద మంది వరకు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చంటూ వెసులుబాటు కల్పించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి సాహసానికి ధైర్యం చేయడంలేదు. కేరళ అనుభవమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంటోంది. సినిమాహాళ్ళు, విద్యా సంస్థలు తెరుచుకోవడం మినహా దాదాపు కరోనాకు పూర్వం ఉన్న పరిస్థితులే కొనసాగుతున్నాయి.. అయినప్పటికీ బతుకమ్మ సంబురాలను ప్రభుత్వం ఆర్భాటంగా జరిపిస్తే తలెత్తే దుష్పరిణామాల కారణంగానే ఈసారి నామమాత్రపు నిర్వహణకే పరిమితమవుతోంది.



Next Story

Most Viewed