పచ్చజెండా ఊపినా… కానరాని ఊపు

by  |
పచ్చజెండా ఊపినా… కానరాని ఊపు
X

దిశ‌, ఖ‌మ్మం: ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని స్థిరాస్తి వ్యాపారంపై క‌రోనా తీవ్ర ప్ర‌భావాన్నే చూపింది. క‌రోనాకు ముందు జిల్లాలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయ‌లు అన్న‌ట్లుగా సాగింది. అయితే గ‌డిచిన నెల‌న్న‌ర రోజులుగా క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డంతో వ్యాపారాలు నిలిచిపోయాయి. ఉద్యోగులు అభ‌ద్ర‌త‌ భావంతో ఉన్నారు. చిరు వ్యాపారుల‌కు స‌రైన గిరాకీ లేదు. ఇలా అన్ని వ‌ర్గాల్లోనూ గుండెల్లో బాధ‌.. భ‌విష్య‌త్‌పై బెంగ నెల‌కొని ఉంది. బుధ‌వారం లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లిస్తూ భూముల రిజిస్ట్రేష‌న్ల‌కు ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపినా ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా సంబరం క‌నిపించ‌డం లేద‌ని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్ర‌జ‌లు ఇప్ప‌ట్లో ప్లాట్లు, ఇళ్ల కొనుగోళ్ల‌కు ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలలో కోతతోపాటు ఇతర సంస్కరణలు వచ్చే అవకాశం కూడా ఉండ‌టంతో స్థిరాస్తి వ్యాపారంపై ప్ర‌జ‌లు ఆస‌క్తి చూప‌డం లేదు. బ్యాంకులు కూడా ప్లాట్లు, ఇళ్ల, ఇతర ఆస్తులపై కొత్త రుణాలు మంజూరు చేసే పరిస్థితి క‌నిపించ‌డం లేదు.

మూడు మాసాల్లోనే రూ. కోట్లలో వ్యాపారం…

సాధార‌ణంగా మార్చి, ఏప్రిల్‌, మే నెల‌ల్లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతది. కానీ, ఈ సారి క‌రోనా ఎఫెక్ట్‌తో రియ‌ల్ వ్యాపారం జ‌ర‌గ‌లేదు. ఈ రంగంపై వేల కోట్ల రూపాయ‌లు కుమ్మ‌రించి కొత్త‌గా వెంచ‌ర్లు మొద‌లుపెట్టిన వ్యాపారులు ఇప్పుడు ఆందోళ‌న చెందుతున్నారు. గ‌డిచిన ఐదేళ్ల‌ల్లో ఖ‌మ్మం, దాని చుట్టుప‌క్క‌లా శ‌ర‌వేగంగా అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయి. ప‌ట్ట‌ణాభివృద్ధికి సంబంధించి రోడ్లు, వంతెన‌లు, క్రీడా ప్రాంగ‌ణాల నిర్మాణం, పార్కులు, అంత‌ర్గ‌త రోడ్ల నిర్మాణం, ఖ‌మ్మం మునిసిపాలిటీ కార్పొరేష‌న్‌గా మార‌డం, కొత్త క‌లెక్ట‌రేట్ల నిర్మాణం జ‌రుగుతుండటంతో రియ‌ల్ వ్యాపారానికి బాగా క‌లిసి వ‌చ్చింది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంది. ఈ వేసవి సీజన్‌లో ప్లాట్ల అమ్మకాలు జోరుగా ఉంటాయన్న ఆశాభావంతో చాలామంది వ్యాపారులు కొత్త వెంచర్లు ప్రారంభించడంతో పాటు పాత వెంచర్లలో భవనాల నిర్మాణాలు ప్రారంభించారు. కానీ, అనూహ్యంగా కరోనా కారణంగా ప్లాట్ల క్రయవిక్రయాలు, భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో వ్యాపారులంతా ఇప్పుడు త‌మ పెట్టుబ‌డులు చేతికి తిరిగి రావ‌డానికి ఎంత‌కాలం ప‌డుతుందోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. రూ. కోట్ల‌లో అప్పులు తెచ్చి మరీ వెంచర్లు చేసిన వ్యాపారులు ఉండ‌టం గ‌మ‌నార్హం.

పెద్ద సంఖ్య‌లో కొత్త వెంచ‌ర్లు..

క‌రోనాకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌ పరిధితో పాటు రఘునాథ‌పాలెం, కల్లూరు, కొణిజర్ల, వైరా, సత్తుపల్లి, మధిర, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్‌, ముదిగొండ, చింతకాని, కామేపల్లి మండ‌లాల్లో రియ‌ల్ వ్యాపారం జోరందుకుంది. భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, సుజాతనగర్‌, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, ఇల్లందు, భ‌ద్రాచ‌లం మండ‌లాల్లోనూ పెద్ద సంఖ్య‌లో కొత్త వెంచర్లు వెలిశాయి. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో అయితే స్థ‌లాల రేట్లు హైద‌రాబాద్‌తో పోటీప‌డేవిధంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ప్రధాన రహదారుల పక్కన ఉన్న ప్లాట్ల ధ‌ర‌లు రూ. కోట్లలో ఉండ‌టం విశేషం. అపార్టుమెంట్ల అమ్మకాలు అదే స్థాయిలో ఉండ‌టం గ‌మ‌నార్హం. అదే మునిసిపాలిటీల పరిధిలో అయితే ప్లాట్ల ధ‌ర రూ. 15 ల‌క్ష‌ల నుంచి 25 ల‌క్ష‌ల వ‌ర‌కు పలుకుతోన్నది. ఖ‌మ్మంలో గ‌జం ధ‌ర రూ. ల‌క్ష‌ల్లో ప‌లుకుతుండ‌గా.. కాలనీల్లో రూ.50 వేల‌కు మించే ఉంటుంది. పెద్ద‌స్థాయిలో రియ‌ల్ వ్యాపారం జ‌రుగుతుండ‌టంతో రిజిస్ట్రేష‌న్ శాఖ‌కు కూడా ఏటా రూ. 120 కోట్ల మేర ఆదాయం స‌మ‌కూర‌డం విశేషం. కానీ, ఈ ఏడాది క‌రోనాతో ప‌రిస్థితి త‌ల‌కిందులైంది. బుధ‌వారం రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం కాగా కార్యాల‌యాల వ‌ద్ద పెద్ద‌గా సంద‌డి క‌నిపించ‌డం లేదు. స్థిరాస్తి వ్యాపారం మ‌ళ్లీ ప‌ట్టాలు ఎక్కాలంటే దాదాపు ఏడాది స‌మ‌యం ప‌డుతుంద‌ని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

Tags: Real Estate Business, Khammam, Plots, Lands, Registration


Next Story

Most Viewed