41 వేలు దాటిన కరోనా కేసులు

by  |
41 వేలు దాటిన కరోనా కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో:

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41 వేలు దాటింది. మృతుల సంఖ్య కూడా 400కు చేరువవుతోంది. ప్రతీరోజూ సగటున పది మంది చనిపోతున్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,676 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 788 ఉంటే పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 224, మేడ్చల్ జిల్లాలో 160 చొప్పున నమోదయ్యాయి. ఒకే రోజున పది మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 396కు చేరుకుంది. హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లోనూ ఇటీవలి కాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నెల ఇదే సమయానికి జిల్లాల్లో సింగిల్ డిజిట్‌లో నమోదవుతున్న కేసులు ఇప్పుడు డబుల్ డిజిట్‌లోకి చేరుకున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఒకే రోజున గరిష్ట స్థాయిలో 92 కేసులు నమోదయ్యాయి.

నల్లగొండ జిల్లాలో 64, సంగారెడ్డిలో 57, వనపర్తిలో 51, వరంగల్ అర్బన్‌లో 47, నాగర్‌కర్నూల్‌లో 30, మెదక్‌లో 26, సూర్యాపేటలో 20, నిజామాబాద్‌లో 20 చొప్పున 28 జిల్లాల్లో 888 కేసులు నమోదయ్యాయి. ఇంతకాలం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 90% జీహెచ్ఎంసీలోనే ఉంటుండగా ఇటీవలి కాలంలో మాత్రం సగం కేసులు జిల్లాల్లో నమోదవుతున్నాయి. తాజాగా వచ్చిన బులిటెన్ వివరాలను పరిశీలిస్తే జీహెచ్ఎంసీలో 788 కేసులు నమోదైతే మిగిలిన 28 జిల్లాల్లో 888 నమోదయ్యాయి. హైదరాబాద్ నుంచి వైరస్ జిల్లాల్లోకి వ్యాపించింది.

రిజ్వీ రాకతో మారిన బులిటెన్ స్వరూపం

ప్రజలకు కరోనా పరీక్షలు ఎక్కడ చేస్తున్నారో, ఎన్ని కేంద్రాల్లో చేస్తున్నారో, ఆసుపత్రుల్లో ఎన్ని బెడ్‌లు ఖాళీగా ఉన్నాయో లాంటి వివరాలన్నింటినీ ప్రజలకు అర్థమయ్యేలా బులిటెన్‌లో ప్రతీరోజూ ఇవ్వాలని హైకోర్టు ఎంత చెప్పినా ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ వాటిని ఇవ్వలేదు. కానీ వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా రిజ్వా రాకతో బులిటెన్ కూర్పులో తేడా కనిపించింది. రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో కరోనా నిర్ధారణ కోసం ఏయే ల్యాబ్‌లో ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారో బులిటెన్‌లో దర్శనమిచ్చాయి. దీంతో రాష్ట్రంలో 10 ప్రభుత్వ ల్యాబ్‌లలో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు, మరో ఆరు ప్రభుత్వ ల్యాబ్‌లలో సీబీనాట్ పరీక్షలు చేస్తున్నట్లు ప్రజలకు బులిటెన్ ద్వారా అర్థమైంది. మరో 23 ప్రైవేటు ల్యాబ్‌లలో మూడు మినహా మిగిలిన అన్నింటిలో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేస్తున్నట్లు తేలింది.

రాష్ట్రం మొత్తం మీద కరోనాకు చికిత్స చేస్తున్న 61 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 17,081 బెడ్‌లు ఉంటే అందులో 471 వెంటిలేటర్లు ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన టెస్టులు, అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నిష్పత్తిని పరిశీలిస్తే 18.85% ఉన్నట్లు బులిటెన్ పేర్కొంది. ఇప్పటివరకు 27,295 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యి కొద్దిమంది హోమ్ ఐసొలేషన్‌లో ఉంటే ఇంకా 13,328 మంది చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింధి.

Next Story