కరోనా డేంజర్ బెల్స్.. 84% ఆ ఎనిమిది రాష్ట్రాల్లోనే..

by  |
corona
X

న్యూఢిల్లీ : రెండో దశలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. మొదటి దశతో పోల్చితే సెకండ్ వేవ్‌లో మహమ్మారి విజృంభణ ఆందోళనకరంగా మారింది. సోమవారం దేశవ్యాప్తంగా 68,020 మంది కొవిడ్-19 బారిన పడగా 291 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644కి చేరింది. మొత్తం మరణాలు 1,61,843కి పెరిగాయి. దేశంలో యాక్టివ్ కేసులు 5,21,808 ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా సోకి కోలుకుంటున్నవారికంటే కొత్తగా ఆ మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన ఐదు రోజుల్లోనే భారత్‌లో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయంటే దేశంలో వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

8 రాష్ట్రాలలోనే అధికం..

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు 8 రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నమోదైన మొత్తం కేసులలో 84 శాతం కేసులు మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడులోనే ఉండటం గమనార్హం. ఇక మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతున్నది. దేశంలో పాజిటివ్ బారిన పడుతున్న వారిలో మూడింట రెండొంతుల మంది ఈ రాష్ట్రం నుంచే ఉన్నారు. సోమవారం మహారాష్ట్రలో 31,643 కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో 2,914 కేసులు రాగా.. కర్నాటకలో 2,792.. ఢిల్లీలో 1,904 మందికి ఈ వైరస్ సోకింది. ఈ రాష్ట్రాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళ (1,897), తమిళనాడు (2,279) లోనూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటం గమనార్హం.

‘మహా’లో లాక్‌డౌన్‌పై గందరగోళం..

మహారాష్ట్రలో వైరస్ విస్తృతి దృష్ట్యా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో పలువురు రాజకీయ పార్టీల నేతలు స్పందించారు. లాక్‌డౌన్ వల్ల ఒరిగేదేమీ లేదని, అంతేగాక ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రం మరింత నష్టాలను చవిచూడాల్సి వస్తుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయమై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. పూర్తిస్థాయి లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందుకు బదులుగా వైరస్‌ను కట్టడి చేయడానికి కఠినమైన ఆంక్షలను విధించాలని సీఎం ఉద్ధవ్ థాక్రేను కోరారు. ఇదే విషయమై బీజేపీ స్టేట్ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కరోనా అలా పుట్టిందట.. డబ్ల్యూహెచ్‌వో నివేదిక..!

ఏడాదికాలంగా ప్రపంచాన్ని స్తంభింపజేస్తున్న కరోనా వైరస్ పుట్టుకపై ఇప్పటికీ స్పష్టమైన అవగాహన లేదు. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందని ఆరోపణలు ఉన్నా ఆ దేశంతో పాటు డబ్ల్యూహెచ్‌వో కూడా దానిని ఖండించింది. తాజా అధ్యయనం ప్రకారం.. గబ్బిలాల నుంచి మరో జంతువుకు సోకి తద్వారా మనుషులకు సంక్రమించిందని తేలిందని డబ్ల్యుహెచ్‌వో, చైనాలు కలిసి చేపట్టిన అధ్యయనంలో వెల్లడైందని ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ ఒక కథనంలో వెల్లడించింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ధృవీకరించలేదు.

Next Story

Most Viewed