నర్సంపేట రైతులను నిండా ముంచిన ‘కావేరి’

by  |
నర్సంపేట రైతులను నిండా ముంచిన ‘కావేరి’
X

దిశ, నర్సంపేట: కావేరి బ్రాండ్ సీడ్స్ నర్సంపేట మండలంలోని ఆకులతండా, నర్సింగపురం, ఏనుగల తండా తదితర గ్రామాలకు చెందిన రైతుల‌ను నిండా ముంచాయి. దాదాపు 100 నుంచి 200 మంది రైతులు వ‌ర్షాకాలం ఆరంభంలో కావేరి కంపెనీ బ్రాండ్ మొక్కజొన్న విత్తనాలను నర్సంపేట పట్టణంలోని వెంకటేశ్వర సీడ్స్ దుకాణంలో కొనుగోలు చేశారు. ఎకరాకు 45 క్వింటాలు దిగుమతి వస్తుందని.. సేల్స్ సిబ్బంది చెప్పడంతో ఆశ‌ప‌డిన రైతులు మూకుమ్మడిగా వెంక‌టేశ్వర్ సీడ్స్ దుకాణంలో కొనుగోలు చేశారు. చేను మొదట ఏపుగా పెరిగినప్పటికీ కంకి వేసే స్థితిలో సరైన అభివృద్ధి లేద‌ని రైతులు గుర్తించారు. నాలుగైదు వరుసల్లో, తక్కువ సంఖ్యలో గింజలు ఏర్పడ్డాయి. దీంతో నిండా మునిగామ‌ని రైతులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ మోసం చేసింద‌ని మండిప‌డుతున్నారు. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టి సాగు చేశామ‌ని, పంట చూస్తే పెట్టుబడిలో 10 శాతం కూడా తిరిగి చేతికి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతున్నారు. చేసిన కష్టం గంగలో పోసిన పన్నీరు అయ్యేలా ఉందని రైతులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేసిన రైతుల పరిస్థితి మరీ ద‌య‌నీయంగా మారింది.

మొద్దు నిద్రలో వ్యవసాయ శాఖ..!

నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా నకిలీ విత్తనాలను అరికట్టాల్సిన బాధ్యత స్థానిక వ్యవసాయ శాఖ అధికారులపై ఉంది. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తుండటం, చూసీ చూడనట్టుగా వ్యవహరించే అధికారుల ఉదాసీనత వల్లే రైతులు నిలువునా మునుగుతున్నార‌న్న విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. నియోజకవర్గంలోని సీడ్స్, ఫెర్టిలైజర్ దుకాణాలపై వ్యవసాయ అధికారుల మానిటరింగ్ లోపం కొట్టొచ్చినట్టు కనపడుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

బాధిత రైతుల్ని ఆదుకోవాలి

నాసిరకం మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతుల పంటచేనును ప‌రిశీలించాం. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. వెంకటేశ్వర సీడ్స్ షాప్ యాజమాన్యం, సీడ్ కంపెనీ యాజమాన్యం నుంచి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. ఎకరాకు రూ. 50 వేల చొప్పున రైతుల‌కు చెల్లించాలి. రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన నిలబడి పోరాడతాం. -ఈర్ల పైడి, రైతు కూలీ సంఘం కార్యదర్శి


Next Story

Most Viewed