కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. డ్రైనేజీ నిర్మాణంపై కాలనీవాసుల ఆందోళన

by  |
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. డ్రైనేజీ నిర్మాణంపై కాలనీవాసుల ఆందోళన
X

దిశ, గీసుగొండ : కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కాలనీవాసులకు శాపంగా మారింది. అధికారులు నిర్లక్ష్యంతో డ్రైనేజీ నిర్మాణాలు అస్తవ్యస్తంగా చేపట్టగా మురుగు నీరు తమ ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు, మహిళలు పెద్దఎత్తున రోడ్డు మీదికి వచ్చి తమ నిరసన తెలిపారు.

వివరాల ప్రకారం.. గీసుగొండ మండలం మొగిలిచర్ల గ్రామం నుండి ధర్మారం వరకు రహదారిని విస్తరిస్తున్నారు. కాగా 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో రహదారికి ఇరువైపులా నాలుగు అడుగుల ఎత్తులో కాల్వ నిర్మాణం చేపడుతున్నారు. ఈ కాల్వ వలన తమ ఇళ్లలోకి వర్షపు నీరు, మురుగు నీరు వచ్చి చేరుతోందని సోమవారం కాలనీ వాసులు మొగిలిచర్ల బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీని నిర్మిస్తామని చెప్పిన కార్పొరేటర్ ఇప్పుడు మాత్రం తమ సమస్యలను పట్టించుకోకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గత నెల 11వ తేదీన ఈ మురుగు కాలువ విషయమై వరంగల్ మున్సిపల్ కమిషనర్‌కు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. మురుగు కాలువ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి ఒక్క అధికారి కూడా నిర్మాణ పనులను పరిశీలించిన దాఖలాలు లేవని, సంబంధిత ఏఈకి మా సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, అధికారుల నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్లు మురుగు కాలువలను అస్తవ్యస్తంగా నిర్మించారని వారు ఆరోపించారు. ఈ డ్రైనేజీకి సమాంతరంగా నిర్మిస్తున్న రహదారి వలన భవిష్యత్తులో వర్షాల కారణంగా మా ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలిపారు.

వెంటనే రహదారి పనులు నిలిపివేసి డ్రైనేజీ సమస్యను తీర్చిన తర్వాత రహదారి పనులు ప్రారంభించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను స్థానికులు కోరారు. లేదంటే ఈ నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్కరసు పూర్ణచందర్, బొట్టు కరుణాకర్, బోడకుంట్ల రాజు, చింత శ్రీనివాస్, పత్తిపాక తిరుపతి, బుక్య చక్రు, చింతం కుమారస్వామి, చింతం సాంబయ్య, సదయ్య, కక్కే రమేష్, అచ్చే కోటేశ్వర్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed