గౌడ్స్‌ రాజకీయంగా ఎదగకుండా కుట్రలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by  |
Minister Srinivas Gowd
X

దిశ,తెలంగాణ బ్యూరో : అనిచివేతలను వ్యతిరేకంగా పోరాటం చేసి జాతులను ఏకం చేసి రాజ్యాన్ని ఏలిన బహుజన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సర్వాయి పాపన్న 371వ జయంతిని బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సర్వాయి పాపన్న కాలం నుంచి ఇప్పటి వరకూ గౌడ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, రాజకీయంగా ఎదగనివ్వకుండా కుట్రలు చేస్తున్నారని, ఇప్పుడు కూడా అలానే ఉందని మంత్రి పేర్కొన్నారు. బహుజన నాయకులను కొందరు ఇబ్బంది పెడితే, మరికొందరు పూర్తిగా నాశనం చేశారని గుర్తు చేసుకున్నారు.

కష్టపడి రాజకీయంగా ఎదిగితే తనపై కొన్ని మీడియా చానళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, భూములను ఖబ్జా చేశానని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌడ నాయకులు ఎదుగుతుంటే ఓర్వలేక ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. పౌరుషమున్న జాతి నుంచి వచ్చానని, బెదిరింపులకు బెదరనని ఆయన హెచ్చరించారు. కల్లు గీత వృత్తిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున హస్సేన్ సాగర్ వద్ద ‘నీరా కేఫ్’ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది పూర్తవగానే జిల్లాలోనూ.. అవసరమైతే ప్రతి గ్రామంలో ఏర్పాటుచేసి గీతా కార్మికులను ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్, వివేక్, చైర్మన్ నాగేందర్ గౌడ్, మాజీ మంత్రి రాజేశం గౌడ్, పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, బాలగౌని బాలరాజు గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, యేలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అమరవేణి నర్సాగౌడ్, అయిలి వెంకన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్, వేములయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు


Next Story

Most Viewed