ఇంద్రవెల్లి పోరుబాట.. దళిత దండోరాలో కొక్కిరాల-ఏలేటి సంగతేంది..!

by  |
ఇంద్రవెల్లి పోరుబాట.. దళిత దండోరాలో కొక్కిరాల-ఏలేటి సంగతేంది..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి.. ఆదిలాబాద్ జిల్లా నుంచి పోరుబాటకు శ్రీకారం చుడుతున్నారు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్మల్ నుంచి నిరసన బాట పట్టగా.. తాజాగా మరోసారి ఆదిలాబాద్ జిల్లా నుంచి పోరాటానికి సిద్ధమయ్యారు.. పోరాటాల ఖిల్లా.. ఆదిలాబాద్ జిల్లా.. ఆదివాసీల అడ్డ.. అమరవీరుల గడ్డ.. అంటూ ఇంద్రవెల్లి నుంచి దళిత దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.. ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో లక్ష మంది దళితులు, గిరిజనులతో సభ నిర్వహించి.. పోరుశంఖం పూరించనున్నారు.. ఈ సభకు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు నాయకత్వం వహిస్తుండగా.. ఉమ్మడి జిల్లా నాయకులు ఏ మేరకు కలిసి వస్తారనేది ఉత్కంఠను రేపుతోంది.

చెదరని మరకలు..

జ‌ల్‌.. జ‌మీన్‌.. జంగిల్ నినాదంతో ఏక‌మైన గిరిజ‌నం.. అట‌వీ భూముల‌పై ఆదివాసీలకు హ‌క్కులు క‌ల్పించాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో స‌భ నిర్వహ‌ణ‌కు ఏప్రిల్ 20తో సరిగ్గా 40 ఏళ్లు పూర్తయ్యాయి. స‌భ‌కు అనుమ‌తి లేదని అడవి బిడ్డలపై పోలీసులు విరుచుకుపడి తుటాల వ‌ర్షం కురిపించటంతో అట‌వీపుత్రులు నేల‌కొరిగారు. ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ సమయంలో చెప్పిన టీఆర్ఎస్ నేతలు.. ఏడేళ్లుగా అమలుకు నోచుకోవటం లేదు. గత రెండేళ్లుగా ఆదివాసీ ఎమ్మెల్యేలు అమరవీరుల స్తూపం వద్ద కనీసం నివాళులు అర్పించట్లేదు. పోలీస్ కాల్పుల్లో చ‌నిపోయిన‌ వారి కుటుంబాలకు, గాయపడ్డ వారికి ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి సాయం, చేయూత లేదు. ఏప్రిల్ 20న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి.. అమరుల కుటుంబాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

తాజాగా అదే అమరవీరుల గడ్డ.. పోరాటాలకు అడ్డగా ఉన్న ఇంద్రవెల్లి నుంచి దళిత దండోరా కార్యక్రమం నిర్వహించేందుకు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 9న లక్షమంది దళితులు, గిరిజనులతో ఇంద్రవెల్లిలో సభ నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17వరకు సుమారు 40రోజుల పాటు నిర్వహించే దళిత దండోరా కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి శ్రీకారం చుడుతున్నారు. పోరుగడ్డ.. అమరుల అడ్డా నుంచి మరో కీలక పోరాటానికి రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుండగా.. టీపీసీసీ బాధ్యతలు చేపట్టాక క్షేత్రస్థాయిలో తొలి పర్యటన కూడా ఉమ్మడి జిల్లాలో చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా.. జూలై 12న నిర్మల్ జిల్లా కేంద్రంలో రేవంత్ సైకిల్, ఎడ్లబండ్ల యాత్రలో పాల్గొన్నారు. తాజాగా మరో కీలక పోరుకు ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకోవటం విశేషం.

టీపీసీసీ చీఫ్ నియామకం విషయంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావును.. తాజాగా ఇద్దరు కీలక నేతలు కలిశారు. ఇంద్రవెల్లి దండోరాకు కొక్కిరాల నాయకత్వం వహిస్తారని టీపీసీసీ చీఫ్ ప్రకటించారు. దీంతో కొక్కిరాల నాయకత్వంలో ఎంత మంది నాయకులు కలిసి వస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమటీ చైర్మన్ ఏలేటికి.. మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్‌ సాగర్ రావుకు మధ్య విభేదాలున్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. తూర్పున కొక్కిరాల పట్టు ఉండగా.. పశ్చిమాన ఏలేటి హవా సాగుతోంది. అలాంటిది పశ్చిమ జిల్లా ఆదిలాబాద్‌లో జరిగే దళిత దండోరాకు కొక్కిరాల నాయకత్వం వహిస్తే.. ఏలేటి వర్గం ఏమేరకు కలిసి వస్తుందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ సభ ఏ మేరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.


Next Story

Most Viewed