తెలంగాణ సీఎస్‌పై కేంద్రానికి ఫిర్యాదు

110

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేశ్ కుమార్ ఏకపక్షంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నారని రాష్ట్రానికి చెందిన విజయగోపాల్ అనే సామాజిక కార్యకర్త కేంద్ర హోం మంత్రిత్వి శాఖ ఆధీనంలోని డీవోపీటీ (వ్యక్తిగత శిక్షణ విభాగం)కి ఫిర్యాదు చేశారు. కేంద్ర సర్వీసు బోర్డు నిబంధనలను పట్టించుకోవడంలేదని అందులో పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న డీవోపీటీ అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులు ఒకసారి నిర్దిష్ట బాధ్యతలను స్వీకరించిన తర్వాత కనీసం రెండేళ్ల వరకు కొనసాగాలని స్పష్టమైన నిబంధన ఉందని విజయ గోపాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బదిలీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే సెంట్రల్ సర్వీసెస్ బోర్డు ద్వారా మాత్రమే జరగాలని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు బోర్డును నెలకొల్పనేలేదని వివరించారు. సుప్రీంకోర్టు సైతం సెంట్రల్ బోర్డు ఏర్పాటు, దాని ఆవశ్యకత గురించి ఒక కేసులో ప్రస్తావించిందని గుర్తుచేశారు. బోర్డుతో సంప్రదింపులు లేకుండానే ఆరు నెలల వ్యవధిలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయని తెలిపారు.

సుప్రీం కోర్టు చెప్పినా..

సెంట్రల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని విజయగోపాల్ లేఖలో వివరించారు. ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారుల బదిలీలపై నిర్ణయం తీసుకోడానికి ఈ బోర్డు అవశ్యమని, దీనికి రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారని విజయగోపాల్ గుర్తుచేశారు. రాజకీయ జోక్యాన్ని తగ్గించడం, నిర్దిష్టంగా ఒక బాధ్యత అప్పజెప్పిన తర్వాత దాన్ని నిర్వర్తించడానికి తప్పనిసరిగా నిర్దిష్ట కాలవ్యవధి అవసరం కావడం తదితర కారణంగానే బోర్డు ఏర్పాటుపై సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 19 రాష్ట్రాలు బోర్డులను ఏర్పాటుచేశాయని, తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా నెలకొల్పిందని పేర్కొన్నారు. విజయగోపాల్ ప్రస్తావించిన అంశాలను అవగతం చేసుకునేందుకు వీలుగా ఆ ప్రతిని కూడా డీవోపీటీ అండర్ సెక్రటరీ తాజా లేఖతో జతచేసి ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శికి పంపారు. ఈ లేఖ గురించి విజయగోపాల్ ఇటీవల మీడియా ప్రతినిధులతో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం సీఎస్‌పై తగిన చర్యలు తీసుకోని పక్షంలో తాను ఇదే అంశంపై హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..