అన్ని ఆదర్శ మున్సిపాలిటీలుగా మారాలి

by  |
అన్ని ఆదర్శ మున్సిపాలిటీలుగా మారాలి
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు ఆదర్శ మున్సిపాలిటీలుగా మారాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మున్సిపల్ కమిషనర్లు, వైస్ చైర్మన్‌లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రకృతి వనాలు, ట్రీ పార్కులు, వీధి వర్తకులను గుర్తించి రుణాలను అందించడం, వైకుంఠదామాలు, డంపు యార్డ్‌ల నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేని నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించారు. గ్రామాల్లో పూర్తి హంగులతో వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, కల్లాలు, అవెన్యూ ప్లాంటేషన్ హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, ట్యాంకర్, ట్రాక్టర్, ట్రాలీ తదితర వసతులతో వివిధ పనులు ఘనంగా జరుగుతున్నాయన్నారు.

ప్రతీ గ్రామంలో పారిశుధ్య నిర్వహణతో పాటు బాగా అభివృద్ధి చెందుతున్నాయని కలెక్టర్ అన్నారు. గ్రామాలు బాగు పడుతుంటే పట్టణాలు అధోగతిలో ఉన్నాయంటూ అసంతృప్తిని వెలిబుచ్చారు. పురపాలికల అభివృద్ధిపై దృష్టి సారించాలని, ఆయా అధికారులతో పాటు మున్సిపల్ పాలకవర్గం పట్టుదలతో పని చేయాలనీ, అభివృద్ధి చేసుకోవాలన్న తపన కలిగి ఉండాలన్నారు. ఏ మున్సిపల్ పరిధిలోను పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగా లేదన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ మిగితా మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని ఆక్రమణలకు గురికాకుండా ఎఫ్‌టీ‌ఎల్‌లో మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి ఇవ్వాలని రెవెన్యూ డివిజనల్ అధికారులు తహసీల్దార్లకు ఆదేశించారు.

Next Story

Most Viewed