పల్లెప్రగతిలో నిర్లక్ష్యం పనికిరాదు

by  |
పల్లెప్రగతిలో నిర్లక్ష్యం పనికిరాదు
X

దిశ, బోధన్: పల్లెప్రగతి కార్యక్రమంలో నిర్లక్ష్యం పనికి రాదని నిజామాబాద్‌ కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం బోధన్ మండలంలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. హరితహారంలో భాగంగా సాలూర ఖాజాపూర్, హున్సా గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. అనంతరం సాలూర గ్రామంలో వైకుంఠ ధామం నిర్మాణా పనులను పరిశీలించి.. ఆ పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని కాంట్రాక్టర్ అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ ధామం వెనకాల మినీవాటర్ ట్యాంక్ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర రోడ్ పక్కనే ఉన్నందున ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి కోరారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులు ఎస్టిమేషన్ వేసి పంపించాలని ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో చేపడుతున్న షెడ్‌ను మహారాష్ట్ర అధికారులు వచ్చి పనులను ఆపేస్తున్నారని, పనులు చేస్తున్న మేస్త్రీలను పీఎస్‌కు తీసుకెళ్తున్నారని కలెక్టర్‌కు బోధన్ ఎంపీపీ చెప్పారు. దీంతో స్థానిక ఆర్టీవో, తహసీల్దార్లను మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి సమస్య ను పరిష్కరించాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర రహదారి బోధన్ నర్సి రోడ్ సాలూర క్యాంపు నుంచి చెక్ పోస్ట్ వరకు మొక్కలు ఎందుకు పెంచలేదని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లను కలెక్టర్ మందలించారు. రాష్ట్ర ఆదాయం తగ్గిన ప్రభుత్వం పంచాయతీలకు ప్రతినెలా నిధులు ఆపలేదని.. మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కార్యదర్శిని నిలదీశారు.

నాటిన మొక్కలు 85శాతం బతకకపోతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ మరియు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరల వారంలో మండలంలో పర్యటిస్తానని, మార్పు కనిపించకపోతే కఠిన చర్యలుంటాయన్నారు. కార్యక్రమంలో ఆర్టీవో గోపిరామ్, తహసీల్దార్ గఫార్ మియా, ఎంపీడీవో కేతావత్ సుదర్శన్, సర్పంచ్లు బుయ్యన్ చంద్రకళ, ఎస్ కె అమీర్, ఎంపీటీసీ కండెల సవిత పాల్గొన్నారు.



Next Story