జూన్‌లో గణనీయంగా బొగ్గు ఉత్పత్తి

by  |
Singareni
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగ‌రేణి సంస్థ జూన్ నెల‌లో గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తి కనబరిచింది. గ‌తేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో ఉత్పత్తి, ర‌వాణా, ఓవ‌ర్ బ‌ర్డెన్ తొల‌గింపులో గ‌ణ‌నీయ‌మైన వృద్ధి సాధించింది. జూన్ నెల‌లో 54.59 ల‌క్షల ట‌న్నుల బొగ్గు ర‌వాణా చేసి.. గ‌తేడాది సాధించిన 28.80 ల‌క్షల ట‌న్నుల ర‌వాణాపై 90 శాతం వృద్ధిని చూపింది. ఈ జూన్‌లో 52.71 ల‌క్షల ట‌న్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి.. గ‌తేడాది ఇదే మాసంలో సాధించిన 32.73 ల‌క్షల ట‌న్నుల ఉత్పత్తిపై 61 శాతం వృద్ధిని క‌న‌బ‌రిచింది. జూన్‌లో 303 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ వెలికి తీసి.. గత ఏడాది ఇదే నెలలో వెలికితీసిన 234లక్షల క్యూబిక్ మీటర్లపై 29.6శాతం వృద్ధి సాధించింది.

కరోనా సమయంలో దేశ ఇంధ‌న అవ‌స‌రాలు తీర్చడానికి ఈ ఆర్థిక సంవ‌త్సరం ఆరంభం నుంచి కార్మికులు, అధికారులు స‌మ‌ష్టిగా ప‌నిచేయ‌డం వ‌ల్లే జూన్‌లో వృద్ధిని సాధించామ‌ని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు నిర్దేశిత ల‌క్ష్య సాధ‌న‌కు పున‌రంకిత‌మై ప‌ని చేయాల‌ని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు కొర‌త త‌లెత్తకుండా చూసేందుకు సింగ‌రేణి వ్యాప్తంగా కార్మికులు క‌రోనా జాగ్రత్తలు తీసుకుంటూ రోజుకు స‌గ‌టున 1.82 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

సగటున రోజుకు 33.1 రైల్వే రేకుల చొప్పున గత నెలలో మొత్తం 993 రేకుల ద్వారా బొగ్గు రవాణా చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు కార్మికులకు అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలు సాధించడం కోసం జులై నెల‌లో ప్రతి రోజు 1.85 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాతో పాటు 12.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాలను సాధించాలని కోరారు. సింగ‌రేణిలో అర్హత క‌లిగిన కార్మికులంద‌రికీ క‌రోనా నుంచి ర‌క్షణ క‌ల్పించేందుకు చేప‌ట్టిన సంపూర్ణ వ్యాక్సినేష‌న్ స‌త్ఫలితాన్ని ఇచ్చింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఉద్యోగులంతా వ్యాక్సిన్ తీసుకొని, క‌రోనా జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించ‌డంతో ర‌వాణా, ఉత్పత్తిలో వృద్ధి సాధ్యమైంద‌ని చెప్పారు.


Next Story