కోల్ ఇండియా నికర లాభం 2080 కోట్లు

by  |
కోల్ ఇండియా నికర లాభం 2080 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: అతి పెద్ద బొగ్గు గనుల సంస్థ కోల్ ఇండియా (Coal india) 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 55 శాతం క్షీణించి రూ. 2,079.60 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 4,629.67 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 25.9 శాతం తగ్గి రూ. 18,486.77 కోట్లకు చేరుకుంది.

గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 24,938.99 కోట్లుగా నమోదైంది. కొనసాగుతున్న కొవిడ్-19 వ్యాప్తి కంపెనీ వ్యాపారంపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తోందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్‌లో చాలావరకు కార్యాలయాలు, కర్మాగారాలు, ఇతర వాణిజ్య సంస్థలు మూతబడటంతో భారత్‌లో విద్యుత్ డిమాండ్ పడిపోయింది.

దీంతో దేశీయంగా బొగ్గు అమ్మకాల్లో సుమారు 80 శాతం క్షీణించినట్టు కంపెనీ పేర్కొంది. అయినప్పటికీ, కరోనా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే మార్పులను, వ్యాపారాలపై ప్రభావాలను నిశితంగా కంపెనీ పరిశీలిస్తోందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

Next Story

Most Viewed