సీఎంఆర్ మాయ.. మిల్లర్ల అసలు ఉద్దేశమేంటో?

by  |
సీఎంఆర్ మాయ.. మిల్లర్ల అసలు ఉద్దేశమేంటో?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం.. రైసు మిల్లర్ల యాజమాన్యాలకు ఓ వరం. కాగితాల్లో చూస్తే.. సీఎంఆర్ ప్రక్రియ క్లీన్‌గా ఉంటుంది. కానీ దాని వెనుక జరిగి మాయ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే. వాస్తవానికి మిల్లర్ల మాయజాలమంతా బహిరంగ రహస్యమే. కానీ ఎటు చూసినా అధికారుల మౌనమే కన్పిస్తోంది. కొంతమంది మిల్లర్లు అధికారులను మేనేజ్ చేసి.. సీఎంఆర్ బియ్యం అప్పగించకుండానే అప్పగించినట్టు లెక్కలు క్లియర్ చేస్తున్నారు. మరికొంతమంది మిల్లర్లు.. ఇప్పటికే రేషన్ దుకాణాల ద్వారా సేకరించిన బియ్యాన్నే.. లబ్ధిదారుల నుంచి సేకరించి.. తిరిగి ఆ బియ్యాన్ని సీఎంఆర్ లెక్కల కింద చూపిన ఘనులు లేకపోలేదు. వాస్తవానికి ఇదంతా అధికార యంత్రాంగం ప్రమేయం లేకుండా ఒక్క మిల్లర్ల జరిగే పని కాదు. ఏటా ఇదే తంతు నడుస్తున్న సీఎంఆర్ ప్రక్రియ షరా మాములే. ఇదిలావుంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2019-20 యాసంగి సీజనుకు సంబంధించిన సీఎంఆర్ ఇంతవరకు పూర్తికాలేదు. ఇప్పటికే రెండు సార్లు తుది గడువును అధికారులు పొడగించారు. అయినా లక్ష్యం చేరుకోకపోవడంతో మరోసారి కేంద్రం ఇటీవల అనుమతినిచ్చింది. ఈసారైనా అనుమతి సీఎంఆర్ సేకరణ పూర్తి అవుతుందా..? లేదా..? అన్నది వేచిచూడాల్సిందే.

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 2019-20 యాసంగి సీజనుకు సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)ను గతేడాది సెప్టెంబరు 30 వరకు అందజేయాల్సి ఉంది. కానీ మిల్లర్లు సీఎంఆర్‌ను ప్రభుత్వానికి లెక్క చెప్పలేదు. దీంతో కేంద్రం డిసెంబరు 31 వరకు గడువును పెంచంది. అయినా కరోనా మహమ్మారి నేపథ్యంలో మిల్లర్లు సీఎంఆర్‌ను పూర్తి చేయలేదు. దీంతో కేంద్రానికి మిల్లర్ల పోకడపై అనుమానం వచ్చింది. దీంతో సీఎంఆర్ సేకరణను తాత్కాలికంగా నిలిపేసి.. మిల్లుల్లో తనిఖీలు చేసింది. కేంద్ర బృందాలు చేపట్టిన ఈ తనిఖీల్లో ధాన్యం నిల్వలు మిల్లుల్లోనే ఉన్నట్టుగా తేలింది. ఈ దశలో కేంద్రం తిరిగి సీఎంఆర్‌కు అవకాశం కల్పిస్తూ ఫిబ్రవరి 28 వరకు గడువును పొడగించింది. ఆ గడువులోపు పూర్తిస్థాయిలో సీఎంఆర్ సేకరణ చేయాలంటూ ఆదేశించింది. ఇదిలావుంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 8.78లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 7.43 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించారు. ఇంకా 1.37లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాల్సి ఉంది. గడువు ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా.. నేటి వరకు గడువు పూర్తికాలేదు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో నల్లగొండ జిల్లా దాదాపు 95 శాతం సీఎంఆర్ పూర్తి చేయడం గమనార్హం.

సీఎంఆర్‌పై ఆధారపడి మిల్లులు..

వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైసు మిల్లులు కేవలం సీఎంఆర్‌పైనే ఆధారపడి కొనసాగుతున్నాయి. ఏటా మిల్లర్లకు రూ.లక్షల్లో లాభం ఉంటుంది. నిజానికి సీఎంఆర్ అనేది ఓ పెద్ద మాయజాలమనే చెప్పాలి. ఆ సంగతి పక్కనబెడితే.. ప్రతి సీజ నులో ధాన్యం తీసుకున్న మిల్లర్లు ఆరు నెలల్లోపు బియ్యం వాపస్ ఇవ్వాల్సి ఉంటుంది. క్వింటాల్ వడ్లకు 68 కేజీల బియ్యం మిల్లర్లు ప్రభుత్వానికి అందిస్తారు. దీనికిగాను ప్రభుత్వం క్వింటాల్ వడ్లను బియ్యంగా మార్చి ఇచ్చినందుకు ఒక్కో క్వింటాల్‌కు రూ.33 చెల్లిస్తుంది. ఇదిగాక తవుడు, నూకలు, ఊక వంటివి మిల్లర్లకే మిగులుతాయి. వాస్తవానికి మిల్లర్లకు ఇది అదనపు లాభమనే చెప్పాలి. ఎందుకంటే.. ఒక్కో క్వింటాల్ వడ్లకు కనీసం మూడు కి లోల కంటే ఎక్కువగానే తవుడు వస్తుంది. బహిరంగ మార్కెట్‌లో కేజీ తవుడు రూ.50 పలుకుతుంది. నూకలకు కేజీ రూ.15, ఊకకు కిలో రూ.5 చొప్పున సగటు ధర వేసినా.. క్వింటాల్ వడ్లను బియ్యంగా మారిస్తే.. మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించే రూ.33 కాకుండా తవుడు, నూక, ఊక రూపంలో రూ.150పైనే లాభం ముడుతుంది. మొత్తంగా మిల్లర్లకు క్వింటాల్‌కు రూ.180 నుంచి రూ.200 వరకు మిగలడం ఖాయం.

ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సీఎంఆర్..

జిల్లా పేరు సేకరించాల్సిన బియ్యం సేకరించిన బియ్యం మిగిలిన బియ్యం

నల్లగొండ 4.41 లక్షల మెట్రిక్ టన్నులు 4.35 లక్షల మె.టన్నులు 6 వేల మె.టన్నులు
సూర్యాపేట 2.29 లక్షల మె.టన్నులు 1.53 లక్షల మె.టన్నులు 76 వేల మె.టన్నులు
యాదాద్రి 2.08 లక్షల మె.టన్నులు 1.55 లక్షల మె.టన్నులు 53 వేల మె.టన్నులు

Next Story

Most Viewed