ఎవరిని ఎంపిక చేద్దాం.. గెలుపు గుర్రాల వివరాల అన్వేషణలో కేసీఆర్

by  |
Cm Kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. పార్టీకి విధేయులుగా ఉండటంతో పాటు స్థానికంగా ఉండేవారికి, అందరితో మంచిగా ఉండేవారిని ఎంపిక చేయనున్నారు. రాబోయే ఎన్నికలకు నేటి ఎంపిక చేసే అభ్యర్థులే కీలకం కానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అగ్రవర్ణాలకే పెద్దపీట వేశారని.. బడుగు, బలహీన వర్గాలను విస్మరించారనే ఆరోపణల నేపథ్యంలో ఎంపికను ఆచూతూచి ఎంపిక చేయనుంది.

శాసనమండలికి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది పదవికాలంలో వచ్చే ఏడాది జనవరి 4న ముగియనుంది. అయితే ముందస్తుగానే ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 23వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మంలో ఒక్కొక్క సీటు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. అయితే ఈ స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్ నేతల వివరాలను సేకరిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ఎవరైతే బాగుంటందనే అభియాన్ని సేకరిస్తున్నారు.

ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉన్నవారెవరూ… ఎవరైతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు వేస్తారూ… గెలుపు సునాయాసం ఎలా అనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. పాతవారికి తిరిగి రెన్యూవల్ చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. బుధవారం కొన్ని జిల్లాలకు చెందిన నేతల అభిప్రాయాన్ని కేసీఆర్ తీసుకున్నట్లు సమాచారం. జనవరి 3 వ తేదీతో పదవీకాలం పూర్తవుతున్న వారిలో కల్వకుంట్ల కవిత ఉండగా, ఆమెను రాజ్యసభకు పంపే ఆలోచనలో పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె స్థానంలో స్థానం కోసం ఆశావహుల్లో పోటీ పెరిగింది.

ముఖ్యంగా ఆకుల లలిత, బిగాల మహేశ్ గుప్తా, అరికెల నర్సారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నిక బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో కూడా తేరా చిన్నపరెడ్డి స్థానంలో ఎంసీ కోటిరెడ్డికి ఇస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇదిలా ఉంటే మిగతా 10 స్థానాల్లో పాతవారికి ఎంతమందికి రెన్యూవల్ చేస్తారు… కొత్త వారు ఎంత మంది అనేది చర్చనీయాశంగా మారింది.


Next Story

Most Viewed