'దళితబంధు'పై కేసీఆర్ ప్లాన్.. ఏడేళ్ల డెడ్ లైన్ వెనుక అసలు గుట్టు ఇదే!

by  |
CM-KCR114
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన ‘దళితబంధు’ ఉద్దేశం క్రమంగా వెలుగులోకి వస్తున్నది. రానున్న ఏడేళ్లలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల మర్మాన్ని ప్రజలు నిదానంగా అర్థం చేసుకుంటున్నారు. ప్రస్తుత టర్మ్ గడువు ఇంకా రెండేళ్లకు పైగా ఉంది. కానీ సంపూర్ణంగా అమలు కావాలంటే ఇంకో ఐదేళ్లు పడుతుంది. దీంతో ఇంకో టర్మ్ కూడా అధికారంలోకి తీసుకురావాలంటూ పరోక్ష సంకేతం ఇచ్చినట్లయింది. ఒకవేళ మళ్లీ అధికారంలోకి రాకపోతే అనే చర్చలు మొదలయ్యాయి. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో దళితవాడల్లో ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ స్థానిక నాయకులు ఓటు వేయాలని కోరుతూనే.. ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థి గెలవకుంటే ‘దళితబంధు’ అందదంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కేసీఆర్ మదిలో ఇంకో ఐదేళ్ల పాటు తమనే గెలిపించాలన్న డిమాండ్, షరతు పరోక్షంగా వ్యక్తమవుతున్నది.

అసెంబ్లీ వేదికగానూ పది రోజుల క్రితం ఇదే వ్యాఖ్యానించారు. ‘ఎలాగూ మళ్లీ గెలిచేది మేమే… ఇంకో ఐదేళ్లు కూడా మేమే ఉంటాం.. అందులో డౌటెందుకు?’ అంటూ అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించడం వెనుక కూడా ప్రజల మైండ్‌ను ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారనే భావన కలుగుతున్నది. ఒకవేళ మళ్లీ అధికారంలోకి రాకపోతే..? అనే గుసగుసలు మొదలయ్యాయి. భారీ ఆర్థిక వనరులతో ముడిపడిన ఈ పథకం పకడ్బందీగా అమలు కావాలన్నా, రాష్ట్రంలోని మొత్తం దళిత కుటుంబాలకు అందాలన్నా రూ. 1.70 లక్షల కోట్లకు పైగా ఖర్చవుతుందంటూ అంకెలతో పాటు వివరించిన సీఎం కేసీఆర్ రానున్న ఏడేళ్లలో సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. అప్పటికల్లా రాష్ట్ర ఖజానాకు రూ. 23 లక్షల కోట్లు రావడం, పోవడం జరుగుతుంది కాబట్టి ‘దళితబంధు’కు నిధులను సమకూర్చడం పెద్ద సమస్యేమీ కాదని వివరించారు. ఏ రాజకీయ పార్టీ కూడా దళితుల ఉద్ధరణ కోసం ‘దళితబంధు’ లాంటి పథకాన్ని తీసుకురాలేదని, భవిష్యత్తులో ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉంటుందని సీఎం వ్యాఖ్యానిస్తూనే.. ఏడేళ్లలో దశలవారీగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక పథకం ప్రకారమే సీఎం పదేపదే దీన్ని ప్రస్తావిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు అభిప్రాయపడుతున్నారు.

‘దళితబంధు’ పథకం కేవలం దళితులకు ఉద్దేశించింది మాత్రమే కావడంతో ‘బీసీ బంధు’, ‘మైనారిటీ బంధు’ లాంటి డిమాండ్లు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మోత్కుపల్లి నర్సింహులు చేరిక సందర్భంగా బీసీలకు, బలహీనవర్గాలకూ ఈ తరహా సాయం అందుతుందని నొక్కిచెప్పారు. అన్ని సెక్షన్ల ప్రజలకూ క్రమంగా దీన్ని వర్తింపజేస్తామని, ఇంకా ఏడేళ్లలో అందరికీ అందుతుందనే భ్రమలు కల్పిస్తున్నారన్న విమర్శలూ వచ్చాయి. ఆ రకంగా దళితేతర పేదల నుంచి వ్యతిరేకత రాకుండా సీఎం కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. బీసీలు, ఇతర బలహీనవర్గాలకూ ఇదే తరహాలో సాయం అందిస్తామనే హమీని ఇవ్వడం ద్వారా వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఆశల్లో ఉండి ఆ సాయాన్ని అందుకోవడం కోసం గెలిపించుకోవాలనే భావనతో ఉంటారనే సందేశాన్ని కేసీఆర్ అందించగలిగారు. మొత్తానికి ఏడేళ్ల టార్గెట్‌లో ఇంకో ఐదేళ్ల టర్మ్ అధికారంలోకి రావాలన్న కోరికను, గెలిపించాలన్న విజ్ఞప్తిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.

Next Story

Most Viewed