‘పారాబాయిల్డ్’ రైతుల నయా పరేషాన్.. 2400 మిల్లుల కథ కంచికేనా?

by  |
‘పారాబాయిల్డ్’ రైతుల నయా పరేషాన్.. 2400 మిల్లుల కథ కంచికేనా?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో పారా బాయిల్డ్ రైస్ మిల్లులు భారీగా మూతపడనున్నాయి. ఫలితంగా రైతులు మిల్లర్ల చేతిలో నిలువు దోపిడికి గురికానున్నారు. పారా బాయిల్డ్ రైస్ కొనబోమంటూ కేంద్రం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు పారాబాయిల్డ్ రైస్ మిల్లులను మూసేయాల్సిన పరిస్థితులు రాబోతున్నాయంటూ సీఎం కేసీఆర్​ చేసిన ప్రకటన కలకలం రేపింది.

2400 మిల్లుల భవిష్యత్ ప్రశ్నార్థకం..

రాష్ట్ర వ్యాప్తంగా 2400 పారాబాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. ఇవన్ని ప్రభుత్వ సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)పైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 150 వరకు పారాబాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. ఒక్క మిర్యాలగూడ పరిధిలోనే 100 ఉండగా, కోదాడలో మరో 24 ఉన్నాయి. ఇందులో ఇప్పటికే చాలా మిల్లులు నష్టాల్లో నడుస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయకపోతే ఆ మిల్లులకు పని లేకుండా పోయి, అందులో పనిచేసేవారు రోడ్డునపడే ప్రమాదముంది. రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగిలో 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. దీంతో ఈ వానాకాలం రైతులు 55 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. దాదాపు 1.4 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనేది అధికారిక అంచనా. కాగా, దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికీ రైస్ మిల్లులు, ఇతర ప్రాంతాల్లో నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో 60 లక్షల టన్నులకు మించి ధాన్యం తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

క్వింటాలుపై రూ.2400 భారం..

రాష్ట్రం నుంచి గతంలో ఒక్క కేరళకు మాత్రమే పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి కాగా, ప్రస్తుతం అక్కడి ప్రజలు సైతం సన్నరకం వడ్లకు అలవాటు పడ్డారు. దీంతో పారాబాయిల్డ్ రైస్‌ను కాకినాడ, కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ మిల్లర్లకు క్వింటాల్‌కు రూ.2,400 పడుతుంది. ఈ ధర ప్రకారం మిల్లర్లకు గిట్టుబాటు అయ్యేలా కొనుగోలు చేయాలంటే క్వింటా వరి ధాన్యాన్ని రూ.1600లోపే కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో రైతులకు కనీస మద్దతు ధర లభించదు. ఎక్స్‌పోర్టు మీద సబ్సిడీ ఇస్తే రైతులకు మద్దతు ధర దక్కే అవకాశం ఉంది. గతేడాది దొడ్డు రకం కాకుండా సన్నాలు సాగు చేస్తే కనీస మద్దతు ధర దక్కకపోనూ ధాన్యం అమ్ముకునేందుకు నానా అవస్థలు పడ్డారు. దీంతో రైతులు దొడ్డు రకం ధాన్యంపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, కేంద్రం నిర్ణయం వల్ల అదీ పోయింది.

కేంద్రం పునరాలోచించాలి..

పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. వ్యవసాయ రంగాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తిరోగమనంలో పడేలా చేస్తోంది. కేంద్రం నిర్ణయంతో రైతులు, రైస్ మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

-కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు


Next Story

Most Viewed