కమల్‌నాథ్ పీఠానికి ‘కమలం’ ఎసరు..

by  |
కమల్‌నాథ్ పీఠానికి ‘కమలం’ ఎసరు..
X

మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాధ్‌కు ‘కమల నాధులు’ నిద్రలేకుండా చేస్తున్నారు. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి టాటా చెబుతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన బేరసారాలు జోరుగా సాగుతున్నట్టు టాక్. ఒక్కోఎమ్మెల్యేకు సుమారు రూ.50కోట్లకు పైగానే కమలం పార్టీ ఆఫర్ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2018ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఆ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింథియా అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, అతని వర్గీయులు 17మంది ఎమ్మెల్యేలు బెంగళూరు క్యాంప్‌లో సేద తీరుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో త్వరలోనే కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నమధ్య ప్రదేశ్ సీఎం కమలనాధ్ గుండెల్లో గుబులు మొదలైంది.
ఈ క్రమంలోనే తాజా పరిణామాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీకి వివరించేందుకు ఆయన సోమవారం ఢిల్లీకి వెళ్లారు. అయితే సరిగ్గా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్‌ సక్సెస్ అయితే పెద్దల సభలో ఆ పార్టీకి మెజార్టీ స్థానాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.లోక్ సభలో పూర్తి మెజార్టీ ఉన్న బీజేపీకి రాజ్యసభలో తగినంత సంఖ్యా బలం లేదు. కావున, లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లులు పెద్దల సభలో పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో తమ సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు కేంద్రం ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. ఇదిలాఉండగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి సీఎం కుర్చీని అధిరోహించేందుకు కమలనాధులు తహతహ లాడుతున్నారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 116 శాసన సభ సభ్యుల మద్దతు కావాలి. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్-114, బీజేపీ-109, బీఎస్పీ-2, ఎస్సీ-1,స్వతంత్రులు-4 సీట్ల చొప్పున గెలుచుకున్నాయి. అయితే 114 స్థానాలున్నా కాంగ్రెస్ ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్నిఏర్పాటు చేసింది. మెజార్టీకి 7అంకెల దూరంలో ఉన్న బీజేపీ అధికారం కోసం ఆపరేషన్ ఆకర్ష్‌ను చేపట్టింది. దీనిలో భాగంగా డబ్బుల ఆశ చూపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలెం విసురుతోంది. ఆ పార్టీ విసిరిన వలలో ఇప్పటికే 17మంది ఎమ్మెల్యేలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వీరు గనుక రాజీనామా చేసినా లేక బీజేపీలో చేరినా కాంగ్రెస్ గవర్నెంట్ కాస్త స్టాక్ మార్కెట్‌లాగా కుప్పకూలే అవకాశం లేకపోలేదు. అదే గనుక జరిగితే సీఎం కమల్‌నాధ్ తన పదవికి రాజీనామా చేసి గప్‌చుప్‌గా ఇంటికి వెళ్లాల్సిందే. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో పరిస్థితులు చక్కబడితే కమల్ నాధ్ పీఠానికి వచ్చే ఢోకా ఏమీలేదు. సమీప భవిష్యత్‌లో మధ్య‌ప్రదేశ్‌ రాజకీయాలను ఎవరు శాసిస్తారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Tags: madhya pradesh, cm kamal nath, bjp leaders, operation akarsh, bengalore

Next Story