జానారెడ్డి పార్టీ మారడు.. కేటీఆర్ కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నడు

by  |
జానారెడ్డి పార్టీ మారడు.. కేటీఆర్ కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నడు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని, జానారెడ్డిలాంటి సీనియర్ నేత పార్టీ మారుతున్నాడంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చౌకబారు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. జానారెడ్డి పార్టీ మారడని, ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని భట్టి స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మంగళవారం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ దుబ్బాక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్‌లో చేరుతున్నారంటూ తప్పుడు వీడియోను రిలీజ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి ఉన్నత విలువలతో ఆదర్శప్రాయమైన రాజకీయాన్ని కొనసాగిస్తున్నారని, ఆయన గురించి తెలిసిన వారు బండి సంజయ్ మాటలను విశ్వసించరని ఆయన తెలిపారు. మైక్ దొరికిందని నోటికొచ్చింది మాట్లాడటం, సవాళ్లు విసరడం, ఎన్నికలు పూర్తయ్యాక కేసీఆర్‌తో చేతులు కలపడం సంజయ్‌కి మామూలేనని ఎద్దేవా చేశారు.

కేటీఆర్ నోరు అదపులో పెట్టుకో..

కేటీఆర్‌కు కండ్లు నెత్తికెక్కి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎవడు అని ఏకవచనంతో మాట్లాడటంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని కేటీఆర్‌ను ఆయన హెచ్చరించారు. గతంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కాళ్లు మొక్కిన సంగతి కేటీఆర్ మరిచిపోయినట్లున్నాడని చురకలంటించారు. కేసీఆర్‌ని తిడితే కేసులు పెడతామని కేటీఆర్ చెబుతున్నాడని, కానీ, ఆ సంస్కృతిని తెచ్చిందే కేసీఆర్ అని ఆయన విమర్శించారు. అసలు తిట్ల దండకాన్ని ఆపాలని ముందు కేసీఆర్‌కు చెప్పాలని భట్టి సూచించారు. రాష్ట్రంలో ఎన్నికలంటే టీఆర్ఎస్, బీజేపీకి ఒక వ్యాపారంలా మారిపోయాయని, ఓటర్లను డబ్బులతో కొనడం అలవాటైపోయిందన్నారు. లేదా ఎన్నికలప్పుడే అభివృద్ధి పేరిట శంకుస్థాపనలు, లేనిపోని హామీలిచ్చి పోలింగ్ తర్వాత మర్చిపోవడం రెండు పార్టీలకు మామూలేనని విమర్శించారు. సాగర్ ఎన్నికల్లోనే టీఆర్ఎస్, బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని భట్టి పేర్కొన్నారు.


Next Story

Most Viewed