గన్ పౌడర్ కథ కంచికేనా..? ‘టాస్క్’‌కు ‘ఫోర్స్’వచ్చిందా…?

by  |
గన్ పౌడర్ కథ కంచికేనా..? ‘టాస్క్’‌కు ‘ఫోర్స్’వచ్చిందా…?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టుగా తయారైంది ఈ కేసు తీరు. అత్యంత ప్రమాదకరమైన గన్ పౌడర్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డా లోతుగా దర్యాప్తు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వలవేసి పట్టుకున్న ఈ దందా వెనక ఉన్నదెవరూ..? ఎవరెవరికి సప్లై అవుతోంది..? అన్న కోణంలో విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

గ్రానైట్ పాలిషింగ్ పౌడర్ మాటున గన్ పౌడర్ సప్లై చేస్తున్న విషయాన్ని రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. అయితే ఫౌడర్ విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేకపోవడం వెనక బడాబాబుల హస్తం ఉందా అన్న చర్చ మొదలైంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా వినియోగిస్తున్న గన్ పౌడర్ అక్రమ వ్యాపారాన్ని పోలీసులు గుట్టు రట్టు చేసినా పూర్తి స్థాయిలో నజర్ వేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కీలక వ్యక్తితోనే సరి…

గన్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్న వెంటనే కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. కరీంనగర్ కు ఈ పౌడర్ సరఫరా చేస్తున్న వ్యక్తి గురించి తెలిపారు. దీంతో హైదరాబాద్ సిటీ పోలీసులు జాంబాగ్ కు చెందిన షబ్బీర్ ను అరెస్ట్ చేశారు. అప్పటి వరకు దూకుడుగా వ్యవహరించిన పోలీసులు అనూహ్యంగా వెనక్కి తగ్గారనే చర్చ జిల్లా మొదలైంది. ఈ కేసులో ట్రాన్స్ పోర్టు కంపెనీల్లో పౌడర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ తరువాత కరీంనగర్ లో ముగ్గురిపై, హైదరాబాద్ లో ఒకరిపై కేసు నమోదు చేశారు. అయితే పేలుడు పదార్థాలకు సంబంధించిన గన్ ఫౌడర్ ను తరలిస్తున్న ట్రాన్స్ పోర్టు కంపెనీలు రవాణా చేయడానికి సాహసించడం వెనక కారణాలేంటన్నది తేలలేదు. అంతేకాకుండా ఇల్లీగల్ గా సాగుతున్న ఈ పౌడర్ ను కరీంనగర్ లో ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు? ఎవరెవరకు వాడుతున్నారు? పర్మిషన్ లేకుండా వినియోగించడానికి ఆంతర్యం ఏంటీ అన్న విషయాలపై దృష్టి సారించకపోవడం విస్మయం కల్గిస్తోంది.

పోలీసులకే పరిమితమా…?

గన్ ఫౌడర్ అక్రమ దందా వ్యవహారం బట్టబయలు అయిన తరువాత కూడా సంబంధిత శాఖలు కూడా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. పోలీసులే కాకుండా ఫైర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మైనింగ్ వంటి డిపార్ట్ మెంట్లు కూడా నజర్ వేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కరీంనగర్ జిల్లాలోని కొన్ని గ్రానైట్ క్వారీలకు గన్ ఫౌడర్ సరఫరా అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏఏ క్వారీలు పేలుడు పదార్థాల వినియోగానికి అనుమతి తీసుకున్నాయి, తీసుకోని క్వారీలు ఏవీ అన్న విషయంపై దృష్టి సారించడం లేదు. అనుమతి తీసుకున్న క్వారీల్లో ఎంతమేర బ్లాక్స్ సేకరించారు వాటి పరిమాణం ఎంత, బ్లాస్టింగ్ చేయడానికి ఎంతమేర పేలుడు పదార్థం అవసరం ఉంటుంది అన్న విషయాలపై ఆరా తీస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ గణాంకాల ఆదారంగా ఏఏ క్వారీల్లో అక్రమంగా పేలుడు పదార్ధాలు వినియోగిస్తున్నారన్న విషయం స్పష్టం అవుతోంది. అంతేకాకుండా అనుమతి లేని క్వారీల్లో పేలుడు పదార్ధాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సీజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ఈ విషయం గురించి పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. గనుల్లో సంబందిత శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు స్థానికులు.

అనుమతి లేకుండానే పేలుళ్లు…

కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ క్వారీల్లో పేలుడు పదార్ధాల వినియోగంపై ఎలాంటి అనుమతి లేకుండానే సాగుతున్నాయని తెలంగాణ భూ పరిరక్షణ సంఘం బాధ్యులు మార్వడి సుదర్శన్ అన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం కారణంగానే అక్రమంగా సాగుతున్న ఈ తంతును నియంత్రించడం లేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలపై దుమ్మెత్తి పోసిన టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్ క్వారీల్లో సాగుతున్న అక్రమాల తంతును కట్టడి చేయడం లేదని ఆరోపించారు.

మార్వడి సుదర్శన్, తెలంగాణ భూ పరిరక్షణ సంఘం నాయకుడు


Next Story

Most Viewed