12 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు క్లోజ్

by  |
grain purchasing centers
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్లు పన్నెండు జిల్లాల్లో దాదాపు ముగింపుకు చేరుకున్నాయని, ఈ నేపథ్యంలో 656 కొనుగోలు కేంద్రాలను క్లోజ్ చేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. యాసంగి సీజన్‌లో వరి పంట సుమారు 52.76 లక్షల ఎకరాల్లో సాగైందని, ఒక్కో ఎకరానికి సగటున పాతిక క్వింటాళ్ల చొప్పున మొత్తం 1.29 కోట్ల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపింది.

ఇందులో విత్తన అవసరాలు, రైతులకు సొంత అవసరాలకు, ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేయడం లాంటివాటికి సుమారు 50 లక్షల టన్నులు పోతాయని, మిగిలిన 80 లక్షల టన్నులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే 60.50 లక్షల టన్నులను సేకరించామని, రానున్న రోజుల్లో మరో 20 లక్షల టన్నులను సేకరించనున్నట్లు తెలిపారు.

పౌరసరఫరాల భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 17 శాతానికి మించని పద్ధతిలో తేమ ఉన్నప్పటికీ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, సుమారు 8.82 లక్షల మంది రైతుల నుంచి రూ. 11,414 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు.

గతేడాది ఇదే సమయానికి (యాసంగి సీజన్) 52.73 లక్షల టన్నులను మాత్రమే సేకరించామని, ఈసారి అది ఎనిమిది లక్షల టన్నులు పెరిగిందని వివరించారు. మొత్తం లక్ష్యంలో దాదాపు 76% మేర కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. ఈ కారణంగానే నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో 656 కొనుగోలు కేంద్రాలను మూసేసినట్లు తెలిపారు.

గన్నీ సంచులకు కొరత

ప్రతీ సంవత్సరం ఉన్నట్లుగానే ఈసారి కూడా గన్నీ సంచులకు కొరత ఏర్పడిందని, రేషను దుకాణాల నుంచి రావాల్సి ఉన్నదని, కానీ ఆశించిన స్థాయిలో రావడంలేదని శ్రీనివాసరెడ్డి వివరించారు. రాష్ట్రం మొత్తం మీద నెలకు 30 లక్షల గన్నీ సంచులు రావాల్సి ఉన్నప్పటికీ మార్చి నెలలో 9.44 లక్షలు, ఏప్రిల్ నెలలో 7.9 లక్షల చొప్పున మాత్రమే వచ్చాయని వివరించారు.

డీలర్ల డిమాండ్ మేరకు ఒక్కో గన్నీ బ్యాగ్ ధరను రూ. 18 నుంచి రూ. 21కి పెంచామని, అయినా అవసరాలకు తగ్గట్లుగా రావడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరుగుతున్నందున గన్నీ సంచుల అవసరం కూడా పెరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రేషను డీలర్లు తక్షణం వాటిని పౌరసరఫరాల సంస్థకు అప్పగించాలని నొక్కిచెప్పారు. అధికారులు కూడా తగిన చొరవ తీసుకోవాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రవాణా చేసే కాంట్రాక్టర్లు సైతం వాహనాలను సకాలంలో ఏర్పాటు చేయడంలేదని శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ విషయంలో జిల్లా అదనపు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టి సక్రమంగా బాధ్యత తీసుకోని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాల్సిందిగా ఆదేశించారు. టెండర్ల ద్వారా రవాణ కాంట్రాక్టర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతున్నందువల్ల ఇలాంటి లోపాలను సహించవద్దని, ఇకపైన కాంట్రాక్టర్ల ఎంపిక పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రేషను డీలర్లు, వంటగ్యాస్ డీలర్లు, డెలివరీ బాయ్‌లు, పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు తదితరులందరికీ వ్యాక్సినేషన్ ఉంటుందని, త్వరలోనే స్పష్టమైన సమాచారం వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.



Next Story