కరోనా నివారణ సంజీవని ‘కాక్‌ టెయిల్’

by  |
cocktail
X

దిశ, ఫీచర్స్ : ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ అంచనాలకు మించి వ్యాప్తి చెందుతోంది. రికవరీ రేటు ఎక్కువగానే ఉన్నా, ప్రాణనష్టం తప్పడం లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. ఈలోగా జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు.. భారత వైద్య మండలి, వైద్య నిపుణులు, పరిశోధకులు, వైరాలజిస్టులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టిసారిస్తున్నారు. రెమిడెసివర్, టోసిల్‌జుమాబ్ ఇంజెక్షన్లతో పాటు ప్లాస్మా థెరపీ, మూలకణాల చికిత్సా విధానాలను ఉపయోగిస్తూ కొవిడ్ బాధితుల ప్రాణాలను కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో యాంటీబాడీ ‘కాక్ టెయిల్ డ్రగ్‌‌’కు ఇండియాస్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) ఆమోదం లభించింది. అసలు ఏంటీ కాక్‌ టెయిల్ డ్రగ్? దీనివల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి?

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ డ్రగ్ మేకింగ్ కంపెనీ ‘రోచ్(Roche)’ ఈ యాంటీబాడీ డ్రగ్ ‘కాక్‌ టెయిల్’‌ను అభివృద్ధి చేసింది. అమెరికాలో అత్యవసర వినియోగానికి ఇప్పటికే ఆమోదం పొందిన ఈ డ్రగ్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం వాడారు. గతేడాది కరోనా బారిన పడినప్పుడు వాడిన ట్రంప్ త్వరగానే కోలుకోవడం విశేషం. కాగా క్లినికల్ అధ్యయనాలు, అమెరికా, యూరప్‌లో కరోనా బాధితుల రికవరీ ఫలితాల ఆధారంగా భారత్‌లోనూ ఎమర్జెన్సీ పేషెంట్లకు ఈ డ్రగ్ వాడేందుకు సీడీఎస్‌సీవో తాజాగా ఆమోదం తెలిపింది.

కాక్‌టైల్ డ్రగ్ ?

సాధారణంగా ‘కాక్‌ టెయిల్’ అనే పదాన్ని డ్రింక్స్ విషయంలో వాడుతుంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ భిన్నమైన లిక్విడ్స్ ఉపయోగించినప్పుడు దాన్ని కాక్‌ టెయిల్‌గా అభివర్ణిస్తాం. కరోనా చికిత్సకు ఉపయోగించే ఈ యాంటీబాడీ డ్రగ్‌లోనూ కాసిరివిమాబ్ (Casirivimab), ఇమ్దేవిమాబ్ (Imdevimab) అనే రెండు యాంటీబాడీలను ఉపయోగించారు. ఇవి రెండు కృత్రిమంగా తయారు చేసిన ప్రోటీన్స్ అని, మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా వైరస్ సోకిన తర్వాత శరీరంలో ఉత్పత్తి చేసే యాంటీబాడీలకు ప్రతిరూపాలని పరిశోధకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్‌‌ను బ్లాక్ చేయడంతో పాటు వైరస్ అటాచ్‌మెంట్ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడంలో ఇవి సాయపడనున్నాయి. కాక్ టెయిల్ విస్తృత స్ప్రెడ్ వేరియంట్‌లకు వ్యతిరేకంగా పనిచేస్తూ, కొత్తగా అభివృద్ధి చెందుతున్న వేరియంట్‌లకు వ్యతిరేకంగా దాని న్యూట్రలైజేషన్ పొటెన్సీ కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని రోచ్ తెలిపింది. వ్యాధితీవ్రత పెరిగే ప్రమాదమున్న వారితో పాటు వైరస్ లోడ్ తక్కువ ఉన్నవారికి ఈ డ్రగ్ ప్రయోజనకరంగా ఉంటుందని సిప్లా వెల్లడించింది. COVID-19 ముప్పు తీవ్రత అధికంగా ఉన్న రోగుల్లో ఈ డ్రగ్ వాడకం ఆస్పత్రిలో చేరాల్సిన అవసరాన్ని తగ్గించినట్టు తేలింది.

ఎంత మోతాదులో?

ఇంట్రావీనస్ ఇన్ఫ్యూషన్ లేదా సబ్కటానియస్ మార్గం(subcutaneous route) ద్వారా 1200 mg (600mg ఆఫ్ ఈచ్ డ్రగ్) మోతాదులో ఈ మందును రోగికి ఇవ్వాలని రోచ్ తెలిపింది. ఈ డ్రగ్‌ను 2 °C నుంచి 8 C ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ప్రమాద తీవ్రత గల కొవిడ్ బాధితులకు, 60 ఏళ్లు పైబడిన రోగులు లేదా హృదయ సంబంధ ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిని ప్రాణపాయం నుంచి కాపాడవచ్చని స్పష్ం చేసింది. హోమ్ ఐసోలేష‌న్‌లో హై-రిస్క్‌‌లో ఉన్న 4,567 మంది కొవిడ్ పేషెంట్స్‌‌కు కాక్ టెయిల్ డ్రగ్ అందించగా.. మరణించే ప్రమాదం 70% వరకు తగ్గినట్లు రోచ్ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు ఈ డ్రగ్ కేవలం నాలుగు రోజుల్లోనే కొవిడ్ లక్షణాలను తగ్గిస్తుండటం విశేషం.

ధర ఎంత?

ఇప్పటికే రెమిడెసివర్, టోసిల్‌జుమాబ్‌ ఇంజెక్షన్లకు డిమాండ్ పెరగడంతో మార్కెట్‌లో దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే కాక్ టెయిల్ డ్రగ్‌ వాటికి ప్రత్యామ్నాయంగా నిలవనుండగా.. ధర విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే సప్లయ్ మీదే దృష్టి పెట్టామని, సిప్లా ఇండియా లిమిటెడ్ ధర నిర్ణయించి పంపిణీ చేస్తుందని రోచ్ ఫార్మా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వీ సింప్సన్ ఇమ్మాన్యుయేల్ వెల్లడించారు. భారతదేశంలో అర్హులైన రోగులకు కాసిరివిమాబ్, ఇమ్దేవిమాబ్ డ్రగ్ ఇవ్వడానికి సిప్లాతో చర్చించామని, ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించడానికి సహకరిస్తున్నామని ఆయన చెప్పారు.


Next Story

Most Viewed