ఇది కాంగ్రెస్‌కు చెడు వార్తే !

by  |
ఇది కాంగ్రెస్‌కు చెడు వార్తే !
X

దిశ, మెదక్ : కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోమారు బయటపడింది. నాయకుల మధ్య సమన్వయ లోపంతో ఇప్పటికే ఆపసోపాలు పడుతున్న హస్తం పార్టీలో లుకలుకలు ఏదోరకంగా బయటపడుతూనే ఉన్నాయి. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోని నాయకుల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఆ పార్టీ అధికార ప్రతినిధి ముందే ఇద్దరు నాయకులు కుస్తీకి దిగారంటే వారి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవలే ఘర్షణ..

మెదక్ జిల్లా చేగుంట దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రావణ్‌కుమార్ తన ఫామ్‌హౌజ్ వచ్చారు. అతన్ని కలిసేందుకు జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పీసీసీ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ వేరు వేరుగా బుధవారం వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ముందే వారిద్దరూ ఘర్షణ పడినట్టు తెలుస్తోంది. శ్రావణ్ కుమార్ కలుగజేసుకుని వారిని మందలించినట్టు సమాచారం.

కొన్నాళ్లుగా అసంతృప్తి..

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పీసీసీ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ మధ్య కొన్నాళ్లుగా వర్గపోరు నడుస్తోంది. పార్టీలోని అన్ని పదవులు ఆయన అనుచరులకు ఇస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని మ్యాడం బాలకృష్ణ చాలాసార్లు కంఠారెడ్డి తీరుపై కాంగ్రెస్ పెద్దల వద్ద, అలాగే పలు సందర్భాల్లోనూ బాహాటంగానే విమర్శలు గుప్పించినట్టు తెలుస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న కేడర్‌ను పట్టించుకోకుండా తన ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారంటూ మ్యాడం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సైతం మ్యాడం తీరుపై గుర్రుగా ఉన్నారు. పీసీసీ పదవిలో కొనసాగుతున్న బాలకృష్ణ ఎన్నడూ తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించలేదని, ప్రతి చిన్న విషయంలోనూ తలదూర్చుతూ ఆయన చెప్పిందే చేయలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కంఠారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలా ఇరు వర్గాల మధ్య ఎప్పుడూ ఏదో లొల్లి జరుగుతూ ఉంది. వీరి పంచాయితీ పలుమార్లు పీసీసీ పెద్దల దగ్గరకూ వెళ్లినట్టు సమాచారం. అయినా నాయకుల తీరు మాత్రం మారలేదు. ఒకే పార్టీలో ఉన్నా ఎవరికి వారే తమ అనుచరులతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. కానీ ఏకతాటిపై ఉండి ఏనాడు టీఆర్‌ఎస్‌ని ఎండగట్టిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల అభివృద్ధిపై గళమెత్తిన సందర్భాలు మచ్చుకైన లేవని పలువురు అంటున్నారు. కానీ వర్గ రాజకీయాలను మాత్రం ఇద్దరు నాయకులు ప్రోత్సహిస్తున్నారంటూ వీరి తీరుపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story