- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజమౌళికి అరుదైన గౌరవం.. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం అంటూ ఎమోషనల్ పోస్ట్
నా జీవితాంతం గుర్తుండిపోయేలాంటి ఇంతటి మరుపురాని జ్ఞాపకాన్ని అందించినందుకు లూమియర్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన థాంక్స్ చెప్పారు.

దిశ, సినిమా: టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అంతర్జాతీయ వేదికపై మరోసారి భారతదేశ కీర్తిని చాటారు. ఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో ఉన్న ప్రసిద్ధ ‘లూమియర్ మ్యూజియం’ సందర్శించిన ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. మార్టిన్ స్కోర్సెస్, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరాంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా వంటి ప్రపంచ సినిమాను శాసించిన ఎందరో ప్రపంచ దిగ్గజాల పేర్లున్న గోడపై ఎస్.ఎస్. రాజమౌళి పేరు కూడా శాశ్వతంగా చెక్కబడి ఉండటం విశేషం. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. ఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో ఉన్న లూమియర్ మ్యూజియంను తాను సందర్శించానని రాజమౌళి చెప్పారు. అక్కడ ప్రేక్షకులు పూర్తిగా నిండిపోయిన థియేటర్లో తన సినిమాలు ఈగ, ఆర్‌ఆర్‌ఆర్ ప్రదర్శించబడ్డాయని వెల్లడించారు. లూమియర్ ఇన్‌స్టిట్యూట్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ అయిన థియరీ ఫ్రీమాక్స్ ఎంతో మర్యాదపూర్వకంగా నన్ను ప్రేక్షకులకు పరిచయం చేశారని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన తనకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెబుతూ.. అసలు ఈ ప్రపంచంలో సినిమా అనేది పుట్టిన వీధి గుండా నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్లారని చెప్పారు.
తన చుట్టూ జరుగుతున్న వీటన్నింటికీ తాను అప్పటికే చాలా ఎమోషనల్ అయిపోయానని జక్కన్న వివరించారు. అక్కడ ఎందరో దర్శకుల పేర్ల బోర్డులతో నిండిన ఒక గోడ ఉందని రాజమౌళి తెలిపారు. మార్టిన్ స్కోర్సెస్, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరాంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా వంటి ప్రపంచ సినిమా దిగ్గజాల పేర్లు దానిపై ఉన్నాయని, అప్పుడే తనకు ఎర్రటి క్లాత్‌తో కప్పి ఉన్న ఒక బోర్డు కనిపించిందని అన్నారు. అది చూడగానే తన మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందని చెప్పారు. సినిమా ప్రపంచంలోని అంతటి గొప్ప మహానుభావుల పక్కన, వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్‌పై తన పేరును కూడా శాశ్వతంగా ఉంచినందుకు ఆ గౌరవానికి తానేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని రాజమౌళి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి తాను కేవలం కృతజ్ఞతలు మాత్రమే చెప్పగలనని, మనస్ఫూర్తిగా, ఎంతో వినమ్రంగా తలవంచుకుంటున్నానని అన్నారు. నా జీవితాంతం గుర్తుండిపోయేలాంటి ఇంతటి మరుపురాని జ్ఞాపకాన్ని అందించినందుకు లూమియర్ ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు. అంతేకాకుండా ఎంతోమందికి స్ఫూర్తి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.






