మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ

by  |
మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో తరచూ భేటీ కావడం అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ పెద్దలు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి నేతృత్వంలో టీం మరోసారి భేటీ కావాలనుకున్నా.. అది కుదరలేదు. అనంతరం దిల్ రాజు నేతృత్వంలో నిర్మాతలు మంత్రులతో తరచూ భేటీ అవుతున్నారు. తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే ఒకవైపు టాలీవుడ్ సీనియర్ హీరో…టాప్ ప్రొడ్యూసర్స్ అంతా ఇలా ఏపీ ప్రభుత్వంతో భేటీలు కావడం చర్చనీయాంశంగా మారింది.

నేడు ఇలా..

సచివాలయంలో మంత్రి పేర్ని నానితో మరోసారి సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. భేటి ముగిసిన అనంతరం మీడియాతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం వైపు నుంచి కొంత సమాచారం అడిగారని.. అది ఇచ్చేందుకే సచివాలయానికి వచ్చినట్లు తెలిపారు. అయితే ఆ సమాచారం ఏంటా అన్నదానిపై దాట వేశారు. మరోవైపు సినిమా టికెట్లు, కరోనా టైంలో సినిమా హాళ్లకు విద్యుత్ చార్జీల బకాయిల పెనాల్టీల విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన భేటీలో దిల్ రాజుతో పాటు అలంకార ప్రసాద్, బన్నివాసు, ప్రసాద్, వంశీ మరికొందరు పాల్గొన్నారు.

నిన్న అలా..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో గురువారం కేబినెట్ భేటీ జరిగింది. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చట్టానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కొందరు నిర్మాతలతో కలిసి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగా సీఎం జగన్‌తో వీరి భేటీ జరిగింది. జగన్ నివాసంలోనే వారంతా భోజనం చేశారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తన శ్రేయోభిలాషి అని…చాలా రోజుల తర్వాత కలిసినట్లు చెప్పుకొచ్చారు.

ఏదో జరుగుతుంది

సినీ ఇండస్ట్రీ పెద్దలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు మంత్రి పేర్ని నానితో పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. అయితే వాటిపై మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. నిన్న మొన్నటి వరకు ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం కోసం కలిశామని చెప్పిన నేతలు ఆ తర్వాత థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ కోసం కలిశామంటూ చెప్పుకొచ్చారు. ఇంతలో ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు..దానికి సినీ పరిశ్రమ సమాధానం ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి. ఇదంతా ఒక ఎత్తైతే గురువారం నాగార్జున, శుక్రవారం దిల్ రాజు నేతృత్వంలోని నిర్మాతల భేటీలపై ఏదో జరుగుతుందనే చర్చ జరుగుతుంది. సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, అందుకు ధన్యవాదాలు తెలిపేందుకే వచ్చామని ఒక్కరూ కూడా ప్రకటించకపోవడం విడ్డూరం. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టూడియోలు చాలా అరుదుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో కొత్త స్టూడియోల ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. భూ కేటాయింపులు..ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలకు సంబంధించి ఏజెన్సీపైనా ప్రభుత్వంతో సినీపెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది

Next Story

Most Viewed