చిన్నారిపై అత్యాచారం.. మీడియా, ప్రభుత్వ తీరుపై నిర‌స‌న జ్వాల‌లు

by  |
Child rape, Protests
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: రాష్ట్ర రాజ‌ధాని హైద‌ర‌బాద్‌లో ఈ నెల 9న అభంశుభం తెలియ‌ని ఆరేళ్ల చిన్నారిపై అత్యంత కిరాతంగా లైంగిక దాడి చేసి హ‌త్య చేసిన ఘ‌ట‌న ప్రజ‌ల్లో తీవ్ర ఆగ్రహ జ్వాల‌లు రేకెత్తిస్తోంది. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా ఓ దుర్మార్ఘుడు దారుణంగా హ‌త్య చేసినా.. తెలంగాణ‌ ప్రభుత్వం, మీడియా స‌రైన రీతిలో స్పందించ‌క‌పోవ‌డంతో ప్రజ‌ల్లో ఆగ్రహం క‌ట్టలు తెంచుకుంటోంది. సినిమా హీరో రోడ్డు ప్రమాదానికి గురైతే స్పందించి.. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి ప‌రామ‌ర్శించిన‌ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఓ గిరిజన కుటుంబానికి చెందిన చిన్నారి మ‌ర‌ణం ఎందుకు క‌నిపించ‌డం లేద‌ని ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్ల చిన్నారి మృతి ప‌ట్ల ప్రభుత్వ వైఖ‌రి తీవ్ర విమ‌ర్శల‌కు దారితీస్తోంది.

Child rape, Protests

గిరిజ‌న కోటాలో ప‌ద‌వులు ద‌గ్గించుకున్న మంత్రి స‌త్యవ‌తి రాథోడ్, ఎమ్మెల్యేలు సైతం బాధితుల‌కు ఎందుకు భ‌రోసా ఇవ్వడం లేద‌ని, క‌నీసం కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డాని కూడా ఎందుకు రావ‌డం లేద‌ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ క‌నుస‌న్నలో న‌డిచే ‘ప‌చ్చ’ మీడియాకు కూడా ప‌చ్చ కామెర్లు క‌మ్మాయ‌ని మండిపడుతున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు గాయాలైతేనే గ‌గ్గోలు పెడుతున్న మీడియా సంస్థలకు, ఓ నిండు ప్రాణం విలువ తెలియ‌డం లేదా అని..? ప్రశ్నిస్తున్నారు. గ‌తంలో డిల్లీలో ఓ చిన్నారిపై జ‌రిగిన లైంగిక దాడిని యావత్తు దేశం ఖండించిందని గుర్తు చేస్తున్నారు. జాతీయ మీడియా విస్తృతంగా ప్రచారం చేయ‌డం ద్వారా నింధితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డింద‌ని, మ‌రి ఇప్పడు ఎందుకు రాష్ట్రంలో మీడియా స్పందించ‌డం లేద‌ని ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. ‘‘నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గు లేని జ‌నాన్ని.. అగ్గితోటి క‌డుగు ఈ స‌మాజ జీవ‌చ్ఛవాన్ని.. మార‌దు లోకం.. మార‌ద కాలం…’’ అని ఓ క‌వి అన్నట్టు నిజంగానే ఈ స‌భ్య స‌మాజం ఎటుపోతుంద‌ని ఆవేద‌న చెందుతున్నారు.

క‌లెక్టర్‌ను పంపి చేతులు దులుపుకున్న ప్రభుత్వం

ఇంత ఘోర‌మైన సంఘ‌ట‌న జ‌రిగితే క‌నీసం ప్రభుత్వం నుండి ఎటువంటి స్పంద‌న లేదు. కేవ‌లం క‌లెక్టర్‌ను పంపించి చేతులు దులుపుకుంది. అది కూడా ప్రజ‌లు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున్న ఆందోళ‌న‌కు దిగ‌డంతో క‌లెక్టర్ ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. ఆందోళ‌న విర‌మింప చేసేందుకు బాధిత కుటుంబానికి తూతూ మంత్రంగా కొన్ని హామీలు ఇచ్చి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ రాలేదు. క‌నీసం మంత్రులు కూడా స్పందించ‌లేదు. మ‌రుస‌టి రోజు రాత్రి సినిమా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదం జ‌రిగిన వెంట‌నే ప్రభుత్వం, మంత్రులు స్పందించిన తీరు ప్రజ‌ల‌ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో మంత్రిల‌పై సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శలు చేస్తూ పెట్టిన పోస్టులు వైర‌ల్‌గా మారాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు

ఆరేళ్ల చిన్నారి హ‌త్య ఉదంతంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ముక్కుప‌చ్చలార‌ని చిన్నారిని పాశ‌వికంగా హ‌త్య చేసిన నిందితుడిని న‌డిబ‌జారులో ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని లేదా ఉరి తీయాల‌ని ప‌లు చోట్ల ప్రజ‌లు స్వచ్ఛందంగా నిర‌స‌న కార్యక్రమాలు చేప‌డుతున్నారు. చిన్నారి మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీలు చేప‌డుతున్నారు. ఘట‌న జ‌రిగిన మ‌రుస‌టి రోజులు ప్రజ‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుమారు 7 గంట‌లకు పైగా సాగ‌ర్ హైవేపై బైఠాయించి నిర‌స‌న వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంట‌నే స్పందించాల‌ని ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రిలే నిరాహార దీక్ష

చిన్నారి హ‌త్యకు నిర‌స‌న‌గా ప‌లు ప్రజా సంఘాలు నేత‌లు సింగ‌రేణి కాల‌నీలో రిలే నిరాహార దీక్ష చేప‌ట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల‌ని, నిందితుడిని ఉరి తీయాల‌ని డిమాండ్ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షకు సీపీఐ నాయ‌కులు సంపూర్ణ మ‌ద్దతు ప్రక‌టించారు. బాధిత కుటుంబానికి న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం కొన‌సాగిస్తామ‌ని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంట‌నే స్పందించాల‌ని. పాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed