తప్పు చేయను.. నాకు వేరే కోరికల్లేవ్ : కేసీఆర్

by  |
cm-kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘ప్రజలు కలగన్న తెలంగాణ తప్ప వేరే పనిలేదు.. నా లైన్‌ను ఎవ్వరూ మార్చలేరు. నాకు ఈ వయసు లో తెలంగాణ ధ్యాస తప్ప మరొకటి లేదు. వేరే కోరికలు ల్లేవ్. నేను కలలు కన్న రీతిలో తెలంగాణ అభివృద్ధి అయ్యేదాకా విశ్రమించబోను.’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. టీటీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరికను పురస్కరించుకొని శుక్రవారం తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. రమణకు గులాబీ కండువా కప్పి కేసీఆర్ సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ కోసం అందరూ కాడి కిందపెట్టినపుడు నేను ఒక్కడిగా జెండా ఎత్తానని, ఒంటరిగా బయలుదేరి సాధించానని స్పష్టం చేశారు. చేనేత కార్మికుల సమస్యలు తనకు తెలుసునని.. చేత్తో నేసేవారే కార్మికులు కారని, నూలువడికేవారు.. దారం తీసేవారంతా చేనేతరంగం కిందకే వస్తారన్నారు. ఏకారణంతో చనిపోయినా వారందరికీ బీమా వర్తింప చేస్తామని ఒకటి రెండు నెలల్లో అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రొపెసర్ జయశంకర్, విద్యాసాగర్ రావు తెలంగాణ పునర్ నిర్మాణం కోసం పరితపించేవారన్నారు.

తెలంగాణ ఏర్పడక ముందే మిషన్ కాకతీయ పథకం రూపకల్పన చేశామన్నారు. కబ్జాలకు గురయ్యే అవకాశాలు ఉన్న చోటే భూములను అమ్మతున్నామని, అందులో భాగంగానే కోకాపేటలో అమ్మిన 40 ఎకరాలకు రూ.2వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని, ఆ డబ్బును పేదల సంక్షేమం కోసమే ఖర్చుచేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందన్నారు. కొందరు సన్నాసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారికి ఎంత చెప్పిన అర్థం కాదన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక జీతాలు పొందుతున్నట్లు వెల్లడించారు. ఒకప్పుడు తెలంగాణలో వ్యవసాయ రంగం నుంచి 12 వేల కోట్ల రూపాయలు జీఎస్ డీపీగా వచ్చేదని అది ఇప్పుడు రూ.5 వేల కోట్లకు చేరిందని స్పష్టం చేశారు. తలసరి విద్యుత్‌లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.

ఒకపుడు తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1070 యూనిట్లు ఉంటే ఇప్పుడు 2170 యూనిట్లకు చేరిందని తెలిపారు. ధరణి ఒక విప్లవం అని, అధికారులు సిబ్బంది తప్పు చేసే అవకాశం లేదన్నారు. సిస్టం తప్పు చేస్తే తప్పా మరో తప్పు జరుగదు అన్నారు. రైతుల బాధలు తొలగిపోయాయన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణను నూరుశాతం నెరవేరుస్తామన్నారు. తప్పులు చేసే అధికారం మాకు లేదన్నారు. ప్రజలకు మంచి తప్ప – తప్పు చేయబోమని, అధికారాన్ని తెలంగాణ కోసం సద్వినియోగం చేస్తాన్నారు. త్వరలోనే రమణకు మంచి పదవి ఇస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్‌లో చేరిన వారిలో పంజుగళ్ల శ్రీసాయిలు రెడ్డి, ఎర్రమాద వెంకన్న నేత, ఎండి తాజోద్దిన్, గుండాల రాజేష్ గౌడ్, కరణం రామక్రిష్ణ, ఎం. మధుకర్, మల్ రెడ్డి, శ్రీధర్, సంధ్యనారాయణ, ఎల్. కార్తికేయ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.



Next Story

Most Viewed